Asianet News TeluguAsianet News Telugu

కలిసి చాయ్ తాగినంత మాత్రానా ప్రతిపక్షాలను ఒక చోట చేర్చినట్టు కాదు: సీఎం నితీష్‌కు ప్రశాంత్ కిశోర్ కౌంటర్

బిహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఇతర రాష్ట్రాలపై ప్రభావం వేయవని, సార్వత్రిక ఎన్నికలపై దాని ఎఫెక్ట్ ఉండదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అలాగే, ప్రతిపక్షాలను ఒక చోట చేర్చాలని చెబుతూ ప్రతిపక్ష నేతలతో సమావేశం అవుతున్న నితీష్ కుమార్ పైనా ఆయన విమర్శలు చేశారు. కలిసి చాయ్ తాగినంత మాత్రానా ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు.
 

bihar cm nitish kumar delhi visit will not impact public or elections says prashant kishor
Author
First Published Sep 11, 2022, 1:04 AM IST

న్యూఢిల్లీ: బిహార్ రాజకీయాల్లో మార్పులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీకి బై బై చెప్పి ఆర్జేడీతో చేతులు కలిపి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం, సీఎం నితీష్ కుమార్ నేషనల్ పాలిటిక్స్‌లో బాగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. 2024 ఎన్నికల కోసం ప్రతిపక్షాలను అన్నింటినీ ఏకతాటి మీదకు తేవాల్సిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. అందుకోసం ప్రతిపక్ష పార్టీలతోనూ ఆయన వరుస భేటీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం నితీష్ కుమార్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి వరుసగా ప్రతిపక్ష నేతలతో సమావేశం అయ్యారు. ఈ ఢిల్లీ పర్యటనపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రియాక్ట్ అయ్యారు.

కొంత మంది నేతలను కలిసి.. వారితో కలిసి చాయ్ తాగినంత మాత్రానా ఒరిగేదేమీ ఉండదని పీకే అన్నారు. ఆ చాయ్ చర్చలు ప్రజలపై, ఎన్నికలపై ఎలాంటి ప్రభావం వేయవని వివరించారు. ఈ సమావేశాలు నితీష్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం, గెలిసే అవకాశాలు, కొత్త నెరేటివ్‌ను సమకూర్చగలవా? అని ప్రశ్నించారు.

గమ్‌తో అతికించిన ఓ ముక్కను బ్రేక్ చేయవచ్చని, కానీ, సీఎం కార్యాలయానికి సీఎం నితీష్ కుమార్‌కు ఉన్న సంబంధాన్ని చెరిపేయలేం అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ బీజేపీ వదిలిపెట్టి గ్రాండ్ అలయెన్స్‌లో చేరడంపై స్పందిస్తూ.. అది రాష్ట్రానికి సంబంధించిన అంశం అని సింపుల్‌గా కొట్టిపారేశారు. ఈ పరిణామాలు మరో రాష్ట్రంపై ప్రభావం వేసే అవకాశాలే లేవని స్పష్టం చేశారు.

సీఎం నితీష్ కుమార్ ఢిల్లీ పర్యటనకు అనవసరమైన గుర్తింపు ఇచ్చారని పీకే అన్నారు. జాతీయ రాజకీయాలపై ఈ పర్యటన ఇసుమంతైనా ఎఫెక్ట్ చూపించదని తెలిపారు.

బిహార్ సీఎం నితీష్ కుమార్ పది ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఆయన సమావేశాలకు పిలుపు ఇచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆయన పర్యటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios