Asianet News TeluguAsianet News Telugu

బిహార్ సీఎంకు ‘ఉద్ధవ్ ఠాక్రే’ భయం.. బీజేపీ కంట్రోల్‌పై బెంగ.. కూటమితో తెగదెంపులు?

బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీతో తెగదెంపులు చేసుకోనున్నారా? ఆయనకు ఉద్ధవ్ ఠాక్రే భయం పట్టిందా? అంటే రాజకీయ నిపుణులు అవునన్నట్టుగానే సమాధానం ఇస్తున్నాయి. మహారాష్ట్ర పరిణామాల్లో బీజేపీ వ్యవహరించిన తీరు ఆయనను వెంటాడుతున్నది. మహారాష్ట్ర ఎపిసోడ్‌కు బిహార సీక్వెల్ అవుతుందా? అనే భయాలు నితీష్‌ను వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. రేపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు.
 

bihar cm nitish kumar afraid of maharashtras cm uddhav thackerays situation.. may split from bjp alliance
Author
Patna, First Published Aug 8, 2022, 3:15 PM IST

పాట్నా: బిహార్‌లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూల మధ్య అంతా సవ్యంగా ఏమీ లేదు. కొన్ని నెలలుగా వీటి మధ్య విభేదాలు పాకానపడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ వ్యవహరించిన తీరుతో బిహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర ఆందోళనలో పడిపోయినట్టు తెలుస్తున్నది. ‘ఏక్‌నాథ్ షిండే’ల భయంతోపాటు.. జేపీ నడ్డా వార్నింగ్ నితీష్ కుమార్ భయాలను రెండింతలు చేసినట్టు అర్థం అవుతున్నది. ప్రాంతీయ పార్టీలు మరెంతో కాలం మనలేవని, అన్ని చోట్లా బీజేపీ పాగా వేస్తుందని జేపీ నడ్డా సుతిమెత్తంగా ఓ వార్నింగ్ ఇచ్చారు. ముందు స్థానిక పార్టీలను బలహీనపరిచి తర్వాత బరిలో లేకుండా చేయడం బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాల్లో ఒకటిగా పేర్కొంటుంటారు.

నితీష్ కుమార్ తమ పార్టీ ఎంపీ ఆర్సీపీ సింగ్‌ను మరోసారి నామినేట్ చేయకపోవడం వెనుకే ఈ భయాలు వెల్లడయ్యాయి. చివరకు ఆయన పార్టీ నుంచి రాజీనామా చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య వైరాన్ని మరింత పెంచినట్టు తెలుస్తున్నది.

కేంద్ర ప్రభుత్వంలో ప్రతినిధిగా ఆర్సీపీ సింగ్‌ను జేడీయూ నిర్ణయించింది. ఆయనను రాజ్యసభకు పంపింది. ఆయనను కేంద్ర ప్రభుత్వం నితీష్ కుమార్ అనుమతి లేకుండానే క్యాబినెట్‌లోకి తీసుకుంది. మొదటి నుంచి ఆర్సీపీ సింగ్‌కు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు సొంత పార్టీని చీల్చే స్థాయి వరకూ వెళ్లవచ్చని జేడీయూలో భయాలు వెలువడ్డాయి. ఇప్పటికే లోక్ జన శక్తి పార్టీ కూడా ఇలాంటి ఐడియాతోనే రెండుగా చీలిపోయింది. చిరాగ్ పాశ్వాన్, పశుపతిలు వేరయ్యారు. 

బీజేపీ ఆర్సీపీని తన గుప్పిట్లోకి తీసుకుని ఉద్ధవ్ ఠాక్రే వలేనే తననూ పదవీచ్యుతిడిని చేసే ముప్పు ఉన్నదని నితీష్ భావిస్తున్నట్టు కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. బీజేపీతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేసిన శివసేన గత అసెంబ్లీ ఎన్నికలతోనే వేరయి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవినే కోల్పోవడమే కాదు.. పార్టీపై పట్టు కోసమూ కొట్లాడే పరిస్థితి వచ్చింది. నితీష్ కుమార్ కూడా బీజేపీతో మొదటి నుంచి సఖ్యంగా ఉన్నప్పటికీ మధ్యలో ఆర్జేడీతో చేతులు కలిపారు. మళ్లీ బీజేపీతో జత కట్టారు.

ఈ భయంతోనే ఆర్సీపీ సింగ్‌ను మళ్లీ రాజ్యసభ సీటు కోసం జేడీయూ నామినేట్ చేయలేదు. ఆయన ఆదివారం పార్టీని వీడుతూ నితీష్ కుమార్‌పై అనేక ఆరోపణలు చేశారు. ప్రధాని కావాలని నితీష్‌కు కోరిక అని, కానీ, ఆయన ఏడు సార్లు జన్మించినా అది సాధ్యం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము కేంద్రంలో ప్రాతినిధ్యం కోసం పంపిన వ్యక్తిలో ఇంతటి పార్టీ వ్యతిరేకత వెల్లడవడం పార్టీలో కలకలం రేపింది.

రాష్ట్ర క్యాబినెట్‌లోనూ అమిత్ షా కనుసన్నల్లో నడిచేవారిని చేర్చారు. అమిత్ షా బిహార్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు నితీష్ కుమార్ భావిస్తున్నారు. బహుశా తనకు వ్యతిరకంగా కుట్ర చేసే అవకాశమూ లేకపోలేదనే అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు చాలా అగ్రెసివ్‌గా మారిపోయారు. నితీష్ కుమార్‌ను పట్టించుకోలేని విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వం తమకు ఇంకా వాటా కావాలనే విధంగా మాట్లాడటం నితీష్ కుమార్‌ను ఆలోచనల్లో వేశాయి.

ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ కొన్ని నెలలుగా బీజేపీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు. రాష్ట్రంలో పొసగని విధంగా ఉంటున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ మాత్రం నితీష్ కుమార్ పట్ల సాదరంగా వ్యవహరిస్తున్నది. కానీ, ఆయన కేంద్రం పిలిచిన సమావేశాలకు వెళ్లడం లేదు. తాజా నీతి ఆయోగ్ మీటింగ్ సహా రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రమాణం సహా ఇతర కార్యక్రమాలకు కేంద్రం పిలిచినప్పటికీ నితీష్ వెళ్లలేదు.

బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు జేడీయూ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. అనంతరం చేసే ప్రకటనలు ఈ అంశంపై కొంత స్పష్టతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఆయన ఆర్జేడీతో సత్సంబంధాలు కొనసాగించడం, అవసరమైతే ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం కూడా ప్రస్తుతం జేడీయూకు ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios