Asianet News TeluguAsianet News Telugu

బీహార్ ఫ్లోర్ టెస్ట్‌కు ముందే స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా..

బీహార్: ఫ్లోర్ టెస్ట్‌కు ముందే స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. అయితే, అంతకుముందు ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టినా సరే రాజీనామా చేయనంటూ పేర్కొన్నారు.
 

Bihar Assembly Speaker Vijay Kumar Sinha resigns ahead of floor test
Author
Hyderabad, First Published Aug 24, 2022, 12:40 PM IST

బీహార్ అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూట‌మితో తెగ‌తెంపులు చేసుకున్న నితీష్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్ర‌మంలోనే నేడు ఆయ‌న ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌ను ఏదుర్కొన‌బోతున్న‌ది. అయితే, దీనికంటే ముందే బీజేపీ నేత‌, బీహార్ స్పీక‌ర్ విజయ్‌ కుమార్‌ సిన్హా అసెంబ్లీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. అంత‌కుముందు ఆయ‌న రాజీనామా చేసే ప్ర‌స‌క్తే లేద‌ని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా స‌రే వెన‌క్కి త‌గ్గేది లేదంటూ స్ప‌ష్టం చేశారు. అయితే, చివ‌ర‌కు రాజీనామా చేయ‌క‌త‌ప్ప‌లేదు.  రాజీనామా చేయ‌డానికి ముందు ఆయ‌న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్‌ ప్రకారం తీర్మానం సమర్పించలేదని తెలిపారు. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (JD(U), RJD, కాంగ్రెస్, CPI(ML), CPI, CPI(M)లతో కూడిన స‌మహాఘ‌ట్భంధ‌న్' 243 మంది సభ్యులతో కూడిన సభలో ఏకంగా 160 కంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉంది. ఇదిలావుండ‌గా, ప్లోర్ టెస్టుకు ముందు ఆర్జేడీ నాయ‌కుల ఆఫీసుల‌పై కేంద్ర సంస్థ‌లు దాడులు ప్రారంభించాయి. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత హాట్ హాట్ గా మారాయి. తేజస్వి యాదవ్‌కు చెందిన గురుగ్రామ్‌లోని నిర్మాణంలో ఉన్న మాల్‌తో సహా ఢిల్లీ, గురుగ్రామ్, పాట్నా, కతిహార్, మధుబనిలోని మొత్తం 25 ప్రాంతాల్లో సీబీఐ దాడులు జరుగుతున్నాయి. ఆర్జేడీ కోశాధికారి, ఎమ్మెల్సీ సునీల్ సింగ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీల ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ నేతలెవరనే విషయాన్ని సీబీఐ అధికారులు వెల్లడించలేదు. ఈ ఏడాది మేలో కేసు నమోదైన రైల్వేలో ఉద్యోగాల కోసం భూముల కుంభకోణం నేప‌థ్యంలో దాడులు కొన‌సాగుతున్నాయి.  సీపీఐ-ఎంఎల్ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం బీహార్ అసెంబ్లీ వెలుపల గుమిగూడి స్పీకర్ వీకే సిన్హా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "దాడుల ద్వారా మమ్మల్ని భయపెట్టే కుట్ర ఫలించదు. ఇది మా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం మా ప్రతిపాదనను పరిశీలించి చర్చించాలి" అని వారు అన్నారు. 

మరోవైపు బీజేపీ నేతలు కూడా మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా విధానసభ వెలుపల నిరసనకు దిగారు. హిందూ దేవుళ్లను అగౌరవపరచడాన్ని సహించబోమని ప్లకార్డులు పట్టుకున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర మంత్రి మహమ్మద్ ఇస్రాయిల్ మన్సూరీతో కలిసి హిందువేతరుల ప్రవేశాన్ని నిషేధించే గయాలోని ఆలయాన్ని సందర్శించడంపై బీహార్‌లోని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ మతానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు నితీష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీహార్ మాజీ సీఎం & ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి మాట్లాడుతూ.. "వారు భయపడుతున్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు మాతోనే ఉన్నాయి. మాకు మెజారిటీ ఉంది. సీబీఐ (రైడ్) మమ్మల్ని భయపెట్టండి. మేము భయపడము.ఇలాంటి దాడులు చేయడం ఇది మొదటిసారి జరగడం లేదు" అంటూ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios