‘సమతా మూర్తి’: అమెరికా రాజధానిలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
భారత్ వెలుపల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికా రాజధానిలో ఆవిష్కరించారు. 19 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పలు దేశాల నుంచి వచ్చిన అతిథుల నడుమ ఆవిష్కరించడం గమనార్హం.

న్యూఢిల్లీ: భారత్ వెలుపల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం అమెరికాలో ఆవిష్కరించారు. అమెరికా వాషింగ్టన్ డీసీలోని మేరీల్యాండ్ సబర్బ్‌లో 19 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీగా పేరు పెట్టారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి ఇండియా అమెరికన్లు, అమెరికా వెలుపలి ఇండియా, ఇతర దేశాల నుంచి సుమారు 500 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం నిన్న జరిగింది.
విగ్రహ ఆవిష్కరణ వేళ వర్షం పడ్డా వారిలో ఉత్సాహం తగ్గలేదు. ఎంతో హుషారుగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రామ్ సుతార్ తయారు చేశారు. గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున సమైక్యతా విగ్రహాన్ని ఈయన నిర్మించారు.
అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ విగ్రహాన్ని మేము సమతా మూర్తిగా పిలుస్తున్నాం. భారత్‌తోపాటు ఎక్కడ చూసినా ఏదో రూపంలో అసమానత కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీగా పేరు పెట్టాం’ అని వివరించారు.
Also Read: Israel: ‘హమాస్‌ను నాశనం చేస్తాం’.. అత్యవసర క్యాబినెట్ భేటీలో ఇజ్రాయెల్ ప్రధాని
‘బాబా సాహెబ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నది. అమెరికాలో ఇదే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. 75 స్వాతంత్ర్యం తర్వాత భారత్‌లో ఇప్పుడు అంబేద్కర్ పాపులారిటీ ఇంకా పెరుగుతున్నది. ఆయన చేసిన కృషిని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు. ఆయనను ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టే, ఆయన పాపులారిటీ రోజు రోజుకు పెరుగుతున్నది.’ అని దళిత్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) జాతీయ అధ్యక్షుడు రవి కుమార్ నర్రా తెలిపారు.
‘గతంలో అంబేద్కర్‌ను కేవలం దళిత నేతగా మాత్రమే గుర్తించేవారు. కానీ, ఇప్పుడు దేశం మొత్తం ఆయనను మహిళ, వెనుకబడి, ఆర్థికంగా బలహీన వర్గాలను సాధికారులు చేయడానికి కృషి చేసిన వ్యక్తిగా అర్థం చేసుకుంటున్నారు’ అని వివరించారు.