Israel: ‘హమాస్‌ను నాశనం చేస్తాం’.. అత్యవసర క్యాబినెట్ భేటీలో ఇజ్రాయెల్ ప్రధాని
హమాస్‌ను సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఈ రోజు అత్యవస క్యాబినెట్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు అత్యవసర క్యాబినెట్‌తో భేటీ అయ్యారు. విస్తరించిన ఈ క్యాబినెట్‌తో ఆదివారం తొలిసారి సమావేశం అయ్యారు. ఈ సమావేశం దేశానికి, ఇతర దేశాలకు మన ఐక్యతను చాటిచెప్పిందని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. గాజాలో హమాస్‌ను సర్వనాశనం చేయడానికి మన దేశం సంకల్పించినట్టు సందేశం వెళ్లిందని అన్నారు.
టెల్ అవీవ్‌లోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేసి 1300 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా క్యాబినెట్ మంత్రులు స్మరించుకున్నారు. వారికోసం కొన్ని క్షణాలు మౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు.
ప్రత్యర్థి పార్టీ చట్టసభ్యుడు బెన్నీ గాంట్జ్ గత వారం ప్రభుత్వంలో చేరారు. ఆయనను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. అనంతరం, నెతన్యాహు మాట్లాడుతూ, మంత్రులు అందరూ 24 గంటలు పని చేస్తున్నారని, ఒక సమైక్య శిబిరంగా ప్రభుత్వం ఉన్నదని తెలిపారు.
Also Read: కుష్టువ్యాధి కారణంగా వారిని కుటుంబాలు వదిలేశాయి.. కోలుకున్నాక 60 ఏళ్ల వయసులో వివాహం
‘మమ్మల్ని నిర్మూలిస్తామని హమాస్ అనుకుంది. కానీ, హమాస్‌ను సర్వనాశనం చేసేది మేమే’ అని నెతన్యాహు అన్నారు. మన ఐక్యత మన దేశానికి, ప్రపంచానికి, శత్రువుకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నదని తెలిపారు.