భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,847 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 83 మంది ప్రాణాలు  కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,263కి చేరగా, 1,306 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 10,887 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 28,070 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read:కొత్త జంట ఫస్ట్ నైట్ కి కరోనా దెబ్బ: వరుడు సహా 26 మంది క్వారంటైన్‌కి

మరోవైపు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ప్రకటించారు. ప్రస్తుతం  రాష్ట్రంలో 95 యాక్టివ్ కేసులు మాత్రమే  ఉన్నాయని.. మరో 401 మంది బాధితులు కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు శైలజ తెలిపారు. ప్రస్తుతం కేరళలో 84 హాట్ స్పాట్లు ఉన్నాయని శైలజ చెప్పారు.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. కేంద్రం లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 12,296 మంది వైరస్ బారినపడగా, 521 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై నగరంలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:కరోనా రోగులకు సేవలు: దేశంలో పలు ఆసుపత్రులపై హెలికాప్టర్లతో పూల వర్షం

అటు గుజరాత్‌లో సైతం కోవిడ్ 19 విజృంభణ తగ్గడం లేదు. మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లో కేసుల సంఖ్య 5 వేలు దాటింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యి క్రాస్ చేసింది.