శరద్ పవార్‌కు షాక్.. అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ, గడియారం సింబల్ ఆయనకే : ఎన్నికల సంఘం
అజిత్ పవార్ వర్గానిదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది.
మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని తిరుగుబాటు గ్రూప్ అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండుగా చీలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిదనే దానిపై రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు తమ వర్గం పేరును, గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని గడువు విధించింది.
కాగా.. గతేడాది ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ సారథ్యంలో బీజేపీ-షిండే సర్కార్‌కు జై కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేయగా, కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కింది. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు వుండగా.. వీరిలో ప్రస్తుతం 12 మంది మాత్రమే శరద్ గ్రూపులో వున్నారు.