అమాయకులే కాదు ఉన్నత చదువులు చదివిన అన్నీ తెలిసినవారు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఓ యువ వైద్యురాలిని ప్రభుత్వాధికారుల పేరిట భయపెట్టి కోట్లు దోచుకున్నారు కేటుగాళ్ళు. 

న్యూడిల్లీ : రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. చదువుకోని నిరక్ష్యరాసులనే కాదు ఉన్నత చదువులు చదివినవారినీ బురిడీకొట్టించి తమనుండి ఎంతటివారైనా తప్పించుకోలేరని నిరూపిస్తున్నారు. ఇలా తాజాగా ఓ వైద్యురాలికి మాయమాటలతో నమ్మించి ఏకంగా నాలుగున్నర కోట్లు స్వాహా చేసారు కేటుగాళ్ళు. భారీ సైబర్ మోసం న్యూడిల్లీలో వెలుగుచూసింది. 

న్యూడిల్లీకి చెందిన 34ఏళ్ల యువ వైద్యురాలిని టార్గెట్ చేసారు సైబర్ నేరగాళ్లు. సదరు వైద్యురాలి పేరుతో కొరియర్ సర్వీస్ ద్వారా ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పార్శిల్ లో డ్రగ్స్ గుర్తించినట్లు నాటకమాడారు. ముంబై నార్కోటిక్, కస్టమ్స్, పోలీసుల అధికారుల పేరిట పలుమార్లు డాక్టర్ కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిపోయిన వైద్యురాలు వారు ఎలా చెబితే అలా చేసి కోట్లు పోగొట్టుకుంది. 

Read More సైబర్ క్రై ముఠా గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు.. రోజుకు రూ. 5కోట్ల మోసం... సూత్రధారి చదువు తెలిస్తే షాకే..

ఈ డ్రగ్స్ కేసు నుండి బయటపడేస్తామంటూ వైద్యురాలిని నమ్మించారు సైబర్ కేటుగాళ్లు. ఇందుకోసం డబ్బులు డిమాండ్ చేయగా రూ.4.47 కోట్లను వారికి ఇచ్చింది. అయితే డబ్బులు అందిన తర్వాత అధికారులమంటూ నమ్మించిన మోసగాళ్ళ ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ అయ్యారు. దీంతో మోసపోయానని గ్రహించిన వైద్యురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ సైబర్ నేరం భయటపడింది. 

బాధిత వైద్యురాలి నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచించారు పోలీసులు.