- Home
- National
- సైబర్ క్రై ముఠా గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు.. రోజుకు రూ. 5కోట్ల మోసం... సూత్రధారి చదువు తెలిస్తే షాకే..
సైబర్ క్రై ముఠా గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు.. రోజుకు రూ. 5కోట్ల మోసం... సూత్రధారి చదువు తెలిస్తే షాకే..
మహిళలను టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ముంబై పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వీరు రోజుకు రూ.5 కోట్ల వరకు మోసం చేస్తారని తెలిసింది.

ముంబై : సైబర్ నేరాలకు పాల్పడుతూ.. కోట్ల రూపాయలు మోసాలు చేస్తూ.. మహిళలను లక్ష్యంగా దోచుకుంటున్న నేరగాడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 12వ తరగతి వరకే చదువుకున్న ఈ సైబర్ నేరగాడు.. దేశవ్యాప్తంగా వేలాదిమంది అమాయక ప్రజలను మోసం చేసినట్లుగా వెలుగు చూసింది. ఇతని టార్గెట్లో మహిళలే ప్రధానంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
అతని పేరు దాడి శ్రీనివాసరావు (49). సైబర్ నేరాల్లో ఆరితేరిన ఇతను రోజుకు దాదాపు రూ. 5కోట్లకు పైగా మోసాలు చేస్తుంటాడు. ఈ సైబర్ నేరగాడిని బాంగుర్ నగర్ పోలీసులు హైదరాబాదులోని ఓ హోటల్ నుంచి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ నేరాలకు పాల్పడే ముఠాలోని మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు కోల్ కతావాసులు కాగా, మరో ఇద్దరూ ఠాణెకు చెందినవారు.
ఇక దాడి శ్రీనివాసరావు తను చేసే నేరాలకు పట్టు పడకుండా ఉండడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు. టెలిగ్రామ్ యాప్ తోనే ఎవరితోనైనా సంప్రదింపులు జరుపుతాడు. అతని చర్యల గురించి పూర్తిగా తెలుసుకున్న పోలీసులు.. ప్రస్తుతం అతడు లావాదేవీలు జరుపుతున్న నలబై బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేశారు.
వాటిల్లో నుంచి రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సైబర్ ముఠా ఎక్కువగా మహిళలనే టార్గెట్ చేస్తుంది. ముందుగా.. ఒకరు ఫోన్ చేసి తాము పోలీస్ అధికారులమని చెబుతారు. మీరు పంపిన కొరియర్ లో ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు దొరికాయని.. మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ బెదిరిస్తారు.
ఆ కొరియర్ తమది కాదని.. అసలు తాము కొరియర్ పంపలేదని వారు చెబితే… అది మీది కాదని నిరూపించుకోవాలని అడుగుతారు. దీని కోసం బ్యాంకు వివరాలు.. లేదా ఆదాయపన్ను వివరాలు పంపాలని ఆదేశిస్తారు. ఆ వివరాలను తనిఖీ చేసి.. ఆ కొరియర్ తో వారికి సంబంధం ఉందో లేదో తెలుస్తామని చెబుతారు.
అప్పటికే కంగారులో ఉన్న ఆ మహిళలు వెంటనే ఆ వివరాలను పంపిస్తారు. దీనికి తోడు.. తమ దర్యాప్తులో భాగంగానే ఓటిపి వచ్చింది షేర్ చేయమని అడుగుతారు. ఆ ఓటిపిని వారితో షేర్ చేసుకుంటారు.
దీంతో ఎనీ డేస్క్ లాంటి యాప్లను ఉపయోగించి బాధితుల ఫోన్లను తన నియంత్రణలోకి తీసుకుంటుంది ఈ ముఠా. దీని ద్వారా బ్యాంక్ అకౌంట్లో పూర్తిగా ఖాళీ చేసేస్తారు.
దేశవ్యాప్తంగా వీరి చేతిలో వేలాది మంది మోసపోయారు. ఇలా.. బాధితుల నుంచి దోచుకున్న సొమ్ము దాడి శ్రీనివాసరావు పేరుతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లిపోతాయి. అలా ఈ బ్యాంక్ అకౌంట్లో రోజుకు రూ. ఐదు నుంచి 10 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి.
ఇలా తమకు తాను నిర్వహించే బ్యాంకు అకౌంట్లోకి చేరిన నగదును దాడి శ్రీనివాసరావు కరెన్సీలోకి మార్చేస్తాడు. ఆ తర్వాత ఆ క్రిప్టో మొత్తాన్ని ఓ చైనా వ్యక్తి అకౌంట్ కు బదిలీ చేస్తున్నాడు.