ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే రోజుల్లో వాలంటైన్స్ డే. ఆ రోజు వారంతా ఆనందంగా గడపాలని అనుకుంటారు. అయితే.. అలా ప్రేమికులు ఆ రోజుని జరుపుకోవడాన్ని వ్యతిరేకించేవారు కూడా చాలా మంది ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే.. ఓ చోట ఈ వాలంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ ఏకంగా రెస్టారెంట్ పై దాడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వాలంటైన్స్ డేకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బీజేపీ మాజీ అధ్యక్షుడు సురేంద్రనాథ్ సింగ్ మద్దతుదారులు ఒక లాంజ్‌ను ధ్వంసం చేశారు. అదేవిధంగా శివసేన కార్యకర్తలు రెస్టారెంట్‌లోకి దూసుకువెళ్లి అలజడి సృష్టించారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 17 మంది అరెస్టయ్యారు. భోపాల్‌లోని పార్కులు, రెస్టారెంట్లు, లాంజ్‌లు, క్లబ్‌లు లాంటి ప్రాంతాలపై ఉదయం నుంచి దృష్టి‌పెట్టిన వివిధ సంఘాల సభ్యులు ఆందోళనలు నిర్వహించారు.

లాంజ్‌పై బీజేపీ మాజీ అధ్యక్షుడు సురేంద్రనాథ్ సింగ్ అనుచరులు దాడికి పాల్పడగా, దాని యజమాని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ సింగ్ మాట్లాడుతూ ఆ హుక్కా లాంజ్ లవ్ జిహాద్‌తో పాటు మత్తు పదార్థాలకు అడ్డగా మారిందన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరో ఘటన హబీబ్‌గంజ్ ప్రాంతంలోని కౌబాయ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. వాలంటైన్ డేను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు ఈ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు 10 మంది శివసేన కార్యకర్తలను అరెస్టు చేశారు.