కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ భారత్ బంద్ అనేక ముఖ్య రంగాలపై ప్రభావం చూపనుంది. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు కూాడా పాల్గొంటున్నారు. దీంతో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది.
కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలను ప్రభావితం చేసేలా కేంద్ర ప్రభుత్వం అలంభిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ నేడు (మార్చి 28), రేపు (మార్చి 29) దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం తెలిపింది. ఈ ఉమ్మడి ఫోరంలో INTUC, AITUC, HMS తో పాటు కార్మిక సంఘాలు అయిన AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC భాగంగా ఉన్నాయి.
ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉందని ఫోరమ్ భావిస్తుందని ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. ఈ సమ్మె ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగ కార్మికులు, ఇతర రంగాలకు చెందిన కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొంటారు.
ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) మద్దతు కూడా ఉంది. బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ నిరసనల్లో పాల్గొనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు నిరసన తెలుపుతున్నాయి.
బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బ్యాంకులు, బీమా వంటి వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రైల్వే, రక్షణ రంగానికి చెందిన యూనియన్లు సమ్మెకు మద్దతుగా పలు చోట్ల పెద్దఎత్తున ఉద్యమించనున్నాయి. కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయడం, ఏ రూపంలో నైనా ప్రైవేటీకరణ చేయడం, జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ వంటివి యూనియన్ల డిమాండ్‌లలో ఉన్నాయి. MNREGA (మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) కింద వేతనాల కేటాయింపులు పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్మా (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ముప్పు ఉన్నప్పటికీ రోడ్డు, రవాణా, విద్యుత్ శాఖల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (మెస్మా)ని అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులను నిరసనలో పాల్గొనకుండా నిషేధించింది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు నిర్వహించే యుటిలిటీలు, ఇతర ఏజెన్సీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, జాతీయ గ్రిడ్ 24 గంటల విద్యుత్ సరఫరా, స్థిరత్వాన్ని నిర్ధారించాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లకు ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఆసుపత్రులు, రక్షణ, రైల్వే వంటి అవసరమైన సేవలలో నిమగ్నమైన వారికి విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఉండాలి.
సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేర్కొంది. సమ్మె రోజులల్లో బ్యాంక్ తన బ్రాంచ్ లు, కార్యాలయాలలో సాధారణ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపింది. అయినప్పటికీ సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలిపింది. సమ్మె విషయంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, వాటిని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు.
