ప్రభుత్వం అందించే రేషన్ ను పంజాబ్ లో ప్రతీ ఇంటికి ఉచితంగా డెలివరీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ నిర్ణయించింది. ఇలాంటి పథకం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 

ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌లు సుల‌భ‌త‌రం చేయ‌డానికి వైఎస్ జ‌గ‌న్ దారిలోనే పంజాబ్ కొత్త సీఎం భ‌గ‌వంత్ మాన్ వెళ్తున్న‌ట్టు కనిపిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఆప్ నేత జ‌గ‌న్ ను ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆంధ్రప్ర‌దేశ్ లో వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్లలోనే రేషన్ పంపిణీలో ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. వాలంట‌రీ వ్య‌వస్థ ద్వారా ప్ర‌తీ ఇంటికి ఉచితంగా రేష‌న్ డెలివ‌రీ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇప్పుడు ఇదే నిర్ణ‌యాన్ని పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ పంజాబ్ లో అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. 

ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్శించ‌డానికి, ప్ర‌జా మ‌ద్ద‌తును కూడ‌గట్టుకోవ‌డానికి పంజాబ్ సీఎం మ‌రో కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం ఇంటింటికీ ఉచితంగా రేష‌న్ పంపిణీ చేయాల‌ని భావిస్తోంద‌ని సీఎం భ‌గ‌వంత్ మాన్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. అయితే ఇది బ‌ల‌వంతం ఏమీ కాద‌ని, ఈ సౌక‌ర్యం కావాల‌ని అనుకున్న‌వారికి మాత్ర‌మే అందిస్తామ‌ని తెలిపారు. పాత ప‌ద్ద‌తిలో కావ‌ల‌నుకున్న వారు అలాగే తీసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. 

ఈ హోం డెలివ‌రీ సౌక‌ర్యం ద్వారా రేష‌న్ పొందాల‌ని అనుకున్న ల‌బ్దిదారులు ముందుగా సంబంధిత విభాగాన్ని సంప్ర‌దించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. అనంత‌రం ప్ర‌భుత్వ అధికారులే ల‌బ్దిదారుల‌కు కాల్ చేసి ఏ స‌మ‌యంలో రేష‌న్ అందుకోవాల‌ని అనుకుంటున్నారో స‌మ‌యం, మిగితా వివ‌రాలు తెలుసుకుంటార‌ని చెప్పారు. వారు ఏ స‌మ‌యంలో కావాల‌నుకుంటే అప్పుడే రేష‌న్ పంపిణీ చేస్తామ‌ని అన్నారు. ప్రజల జీవితాలను మ‌రింత‌ సులభతరం చేయాలని ప్రభుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంద‌ని భ‌గ‌వంత్ మాన్ చెప్పారు. ప్రభుత్వాలు చేయవల‌సిన ప‌ని ఇదే అని అన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాల‌ను రూపొందించిన త‌రువాత త్వరలోనే ఈ పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.

ఈ విష‌యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ ఈ రోజు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేష‌న్ డోర్ స్టెప్ డెలివరీని ప్రకటించారు. త్వరలో ఇది అమలు అవుతుంది. మేము ఈ ప‌థ‌కాన్ని ఢిల్లీలో గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా అమ‌లు చేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాం. మేము ప్ర‌తిదీ ప్లాన్ చేశాము. కానీ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం దానిని ఆపింది’’ అని అన్నారు. ‘‘ఒక సామెత ఉంది. సమయం వచ్చినప్పుడు ఎవ‌రి ఆలోచ‌న‌ను మీరు ఆప‌లేరు. ఢిల్లీలో దీనిని అమలు చేయడానికి వారు (కేంద్రం) మమ్మల్ని అనుమతించలేదు. నో ప్రాబ్లం. మేము దీనిని పంజాబ్ అమలు చేస్తాం. అప్పుడు దేశం మొత్తం డిమాండ్ చేస్తుంది. ఈ ప‌థ‌కం మొహల్లా క్లినిక్‌ల మాదిరిగా దేశంలో మొత్తం అమలకు నోచుకుంటుంది.” అని అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. 

గ‌తంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే ర‌క‌మైన ప‌థ‌కాన్నిఅమ‌లు చేయాల‌ని భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యంతో అది నిలిచిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం డోర్‌స్టెప్ డెలివరీ పథకం కింద కుల, వివాహ ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త నీటి కనెక్షన్‌లతో సహా 100 అత్యవసర ప్రజా సేవలను ఇంటి వ‌ద్ద‌నే అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చింది. దీని కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీలో రెండో సారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత అర‌వింద్ కేజ్రీవాల్ తీసుకున్న తొలి నిర్ణ‌యం ఇదే. కాగా ఏపీలో ఈ ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమ‌లు అవుతోంది.