Bhagavad Gita: ఇప్పటికే గుజరాత్ ప్రభత్వం భగవద్గీతను స్కూల్ సిలబస్‌గా చేర్చబోతున్నామని ప్రకటించింది. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వం సైతం ఇదే విషయం గురించి నిపుణులతో చర్చిస్తున్నదని రాష్ట్ర మంత్రి బీసీ.నగేశ్ తెలిపారు.
Bhagavad Gita: 2022-23 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా 6 నుండి 12 తరగతులకు భగవద్గీత పాఠశాల సిలబస్‌లో భాగంగా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రకటించింది. విద్యా శాఖకు బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా విద్యాశాఖ మంత్రి జితు వాఘాని శాసనసభలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, ఇదే తరహా నిర్ణయం తీసుకునే విధంగా కర్నాటక ప్రభుత్వం కూడా ముందుకు సాగుతున్నదని తెలిసింది. పాఠశాల సిలబస్‌లో భగవద్గీతను ప్రవేశపెట్టాలని గుజరాత్ ప్రభుత్వం యోచిస్తోందనీ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విద్యావేత్తలతో చర్చిస్తున్నదని కర్నాటక ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ. నగేశ్ వెల్లడించారు.
''గుజరాత్‌లో మూడు నుంచి నాలుగు దశల్లో నైతిక శాస్త్రాన్ని (moral science) ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొదటి దశలో భగవద్గీతను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఈ విషయం ఈరోజు నా దృష్టికి వచ్చింది. 'నైతిక శాస్త్రం' ప్రవేశపెట్టే విషయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో చర్చించిన తర్వాతే మేము దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడిస్తాం” అని మంత్రి నగేశ్ మీడియాతో అన్నారు. పిల్లల్లో సాంస్కృతిక, సాంప్రదాయ విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొన్న మంత్రి.. నైతిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని చాలా మంది కోరుతున్నారని తెలిపారు.
''రాబోయే రోజుల్లో నైతిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టే విషయంలో ముఖ్యమంత్రి సలహా తీసుకుంటాం. మేము ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటే, నైతిక శాస్త్రంలోని కంటెంట్ మరియు తరగతి వ్యవధి గురించి విద్యా నిపుణులతో చర్చిస్తాము” అని మంత్రి నగేశ్ చెప్పారు. మహాత్మా గాంధీ సహా అనేక మంది రాజనీతిజ్ఞులు భగవద్గీత, రామాయణం, మహాభారతాల నుండి ప్రేరణ పొందారని నగేశ్ నొక్కి చెప్పారు. తాను పెద్దయ్యాక రాజా హరిశ్చంద్ర నాటకం తన జీవితంపై పెను ప్రభావం చూపిందని మంత్రి వివరించారు.
హిందూ మత గ్రంథాలలోని నైతిక విలువలను ప్రస్తావించిన ఆయన.. ఆధునిక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు లేని ప్రాచీన భారతదేశంలో మంచి సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఈ పుస్తకాలలోని బోధనలే కారణమని అన్నారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే వాటిని పరిచయం చేయడం మన కర్తవ్యం. అయితే ఏది పరిచయం చేయాలనేది విద్యావేత్తలకే వదిలేస్తామని మంత్రి నగేశ్ అన్నారు. ''పిల్లలకు భగవద్గీత బోధించకూడదని కాదు.. ఎందుకంటే.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రాత్రి భగవద్గీతను చదివానని, అదే తన బలమని ఎస్.ఎం.కృష్ణ నాతో చెప్పేవారు'' అని మంత్రి అన్నారు. ''భగవద్గీత, రామాయణం, మహాభారతం లేదా యేసుక్రీస్తు కథలు మరియు బైబిల్ మరియు ఖురాన్‌లోని మంచి బోధనలను పరిచయం చేయడం గురించి నిపుణులు ఏమి చెప్పినా ముందుకు సాగుతామని అన్నారు. దానిని నైతిక శాస్త్రంలో బోధిస్తామని మంత్రి వివరించారు.
కాగా, దీనిపై ప్రతిపక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ''వివిధ విశ్వాసాల మతపరమైన ఆచారాల గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. విద్యావ్యవస్థలో వాళ్లు (బీజేపీ ప్రభుత్వం) ఎలాంటి కంటెంట్‌ను ప్రవేశపెట్టాలనుకుంటున్నారో చూడాలి. పాఠ్యపుస్తకాల్లో వివిధ మతాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కొత్త విషయాలను మరింతగా కీర్తించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను'' అని కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ కొత్త ఆలోచనను ప్రవేశపెట్టడం లేదని ఆయన నొక్కి చెప్పారు. ''ముఖ్యమంత్రిగా కెంగల్ హనుమంతయ్య భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలను రెండు రూపాయలకే పంపిణీ చేశారు. ఇంతమంది (కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం) కొత్తగా చేసిందేమీ లేదు. దానికి వాళ్లు క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని శివకుమార్ అన్నారు.
