Asianet News TeluguAsianet News Telugu

నకిలీ వ్యాక్సిన్లపై తస్మాత్ జాగ్రత్త!.. గుర్తించడానికి సూచికలు విడుదల చేసిన కేంద్రం

నకిలీ కరోనా టీకాలు వస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. టీకాలు నిజమైనవా? కావా? అని కనుగొనడానికి కొన్నిసూచికలను రాష్ట్రాలకు పంపింది. టీకా కంపెనీలు పంచుకున్న సమాచారాన్ని కేంద్రం పేర్కొంది. ఇందులో ప్రముఖంగా టీకా లేబుల్స్ వివరాలే ఉన్నాయి.
 

beware of fake vaccine here are centre issued parameters to check geniunity of covid-19 vaccines
Author
New Delhi, First Published Sep 5, 2021, 1:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఇప్పటికీ ఆస్ట్రేలియా సహా పలుదేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి శాస్త్రజ్ఞుల నిర్విరామ కృషికి ప్రతిఫలమే టీకాలు. కానీ, ఈ టీకాలనూ నకిలీ మహమ్మారి వదల్లేదు. ప్రాణాలు హరిస్తున్న కరోనాకు విరుగుడుగా వచ్చిన టీకాలపైనా నకిలీ పంజా వేస్తున్నది. ఇప్పటికే కొన్ని దేశాల్లో నకిలీ టీకాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొవిషీల్డ్ నకిలీ టీకాలు బయటపడ్డట్టు ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీ టీకాలను గుర్తించడానికి కొన్ని సూచికలను విడుదల చేసింది.

మనదేశంలో ప్రస్తుతం మూడు టీకాలు వినియోగంలో ఉన్నాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ. మరో మూడింటికి అనుమతి లభించినా ఇంకా మార్కెట్లోకి రాలేవు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మూడు టీకాలు నిజమైనవా? నకిలీవా? అని తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పారామీటర్లను రాష్ట్రాలకు పంపింది. మూడు టీకాల కంపెనీలు పంచుకున్న వ్యాక్సిన్ వయల్ లేబుల్, కలర్, ఇతర వివరాలను రాష్ట్రాలకు తెలిపింది.

మనదేశంలోనూ కరోనా నకిలీ టీకాలు అమ్ముడవుతున్నట్టు వార్తలు వచ్చాయని ఇటీవలే కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి ఉపక్రమించిందని వివరించారు. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం వాస్తవ టీకాలను గుర్తించడానికి తెలిపిన కొన్ని సూచనలు ఇలా ఉన్నాయి..

కొవిషీల్డ్ :

ఎస్ఐఐ(సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) లేబుల్‌ను గుర్తించాలి. లేబుల్ కలర్ డార్క గ్రీన్‌గా ఉంటుంది. జెనెరిక్ పేరు బోల్డ్‌గా ఉండదు. ఈ నేమ్ తర్వాత రికాంబినెంట్ అని బ్రాకెట్‌లో ప్రింట్ చేసి ఉంటుంది. ఎస్ఐఐ లోగో లేబుల్ వెనుకవైపు ప్రింట్ చేసి ఉంటుంది. ప్రత్యేక కోణంలో చూస్తే లేబుల్ మొత్తం తేనెతెట్టే తరహా డిజైన్(హెక్సాగోనల్) ఒకటి కనిపిస్తుంది.

కొవాగ్జిన్ :

యూవీ హెలిక్స్(డీఎన్ఏ తరహా చిత్రం) లేబుల్‌పై కనిపించకుండా ఉంటుంది. యూవీ లైట్ కిందే ఇది కనిపిస్తుంది. లేబుల్‌లో బిందువుల రూపంలో సూక్ష్మంగా కొవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కొవాగ్జిన్‌లోని ఎక్స్ అక్షరంలో గ్రీన్ ఫాయిల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సగం ఎక్స్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

స్పుత్నిక్ వీ:

స్పుత్నిక్ వీ టీకాలు రష్యాలోని రెండు తయారీకేంద్రాల్లో ఉత్పత్తి అయ్యాయి. కాబట్టి రెండు లేబుల్స్ వేరుగా ఉంటాయి. కానీ, అందులోని సమాచారం, డిజైన్ మాత్రం ఒకటే. కేవలం మ్యానుఫ్యాక్టరర్ పేరు వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న అన్ని టీకా బాక్సులకు ముందు వెనుకాల ఇంగ్లీష్ లేబుల్స్ ఉంటాయి. మిగతా అన్ని వైపులా రష్యన్ లాంగ్వేజ్‌లో ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios