Bengaluru stampede: బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. ఆర్సీబీ, కేఎస్‌సీఏపై కేసు నమోదుతో పాటు వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, పోలీస్ అధికారుల సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చారు.

Bengaluru stampede: జూన్ 4న బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఆర్సీబీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఈవెంట్ నిర్వహణ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్‌మెంట్ నెట్‌వర్క్స్‌కి చెందిన అధికారులు అరెస్టు చేయాలని ఆదేశించారు.

 బెంగళూరు తొక్కిసలాట కేసు: ఏ1గా ఆర్సీబీ, ఏ2గా ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఏ3గా KSCA

ఈ ఘటనపై పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ నిర్లక్ష్యం ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఆర్సీబీ, KSCA, డిఎన్ఏ ఎంటర్టైన్‌మెంట్‌లపై నేరపూరిత నిర్లక్ష్యం వల్ల 11 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై సీఐడీ, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. ఈ కేసులో ఏ1గా ఆర్సీబీ, ఏ2గా ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఏ3గా KSCA లను పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు ఇచ్చారు.

బెంగళూరు తొక్కిసలాట: పలువురు పోలీసు అధికారుల సస్పెండ్

అలాగే, బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద్‌, అదనపు పోలీస్ కమిషనర్‌, సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్ కమిషనర్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కి చెందిన అధికారులందరినీ ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమానికి తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

బెంగళూరు తొక్కిసలాట కేసు: హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ విచారణ

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసి 30 రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ విచారణ జరుగుతుందని తెలిపారు. మరోవైపు కర్ణాటక హైకోర్టు ఈ ఘటనపై స్వయంగా సుమోటోగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జూన్ 10లోపు ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.