ప్రధానమంత్రి కార్యాలయంలో పెద్ద అధికారినని… కేంద్ర హోంమంత్రి అమిత్ షా దత్తపుత్రుడినని నమ్మించి ఓ డాక్టర్‌ను రూ.2.7 కోట్లకు మోసం చేసిన సుజయేంద్ర అనే నిందితుడిని   పోలీసులు అరెస్ట్ చేశారు.  

Bengaluru Fake PMO : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయ అధికారినంటూ ఘరానా మోసానికి పాల్పడ్డాడో వ్యక్తి. అతడి ఉచ్చులోపడి ఏకంగా రూ.2.7 కోట్లు మోసపోయాడో వైద్యుడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. 

తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో పనిచేసే ఉన్నత అధికారినని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దత్తపుత్రుడినని చెప్పుకుని ఓ డాక్టర్‌ నమ్మించాడు బెంగళూరువాసి సుజయ్ అలియాస్ సుజయేంద్ర. ఇతడు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ డాక్టర్‌ను టార్గెట్ చేశాడు. తాను పీఎంఓ అధికారినని సదరు డాక్టర్ ను నమ్మించాడు. ఇందుకోసం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసున్న ఫొటోలను చూపించి నమ్మకం కలిగించి మోసం చేశాడు.

విల్లా ఆసుపత్రి పేరిట టోకరా…

దేవనహళ్లి దగ్గర అత్యాధునిక విల్లా మోడల్‌లో ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పిస్తానని సుజయేంద్ర సదరు డాక్టర్ ఆశ చూపాడు. ఈ సాకుతో డాక్టర్ నుంచి దశలవారీగా రూ.2.7 కోట్ల డబ్బు వసూలు చేశాడు.

ఈ మోసం ఎలా బయటపడింది?

మోసపోయిన డాక్టర్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన విజయనగర పోలీసులకు సుజయేంద్ర నాటకం ఆడినట్లు తెలిసింది. అతడిని అరెస్ట్ చేసి విచారించగా మోసం బట్టబయలైంది.

నిందితుడు సుజయేంద్ర ఎంతటి ఘనుడంటే ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లిన పాత నేరస్థుడు. అతనిపై ఇప్పటికే 4 చెక్ బౌన్స్ (Cheque Bounce) కేసులు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. ఇన్ని మోసపూరిత కేసులు ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రితో స్టేజ్ పంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ కేసును నమోదు చేసుకున్న విజయనగర పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.