ఓయోలో పెద్ద మోసం జరుగుతోందా..? ‘డేలైట్ హైస్ట్’ ఆరోపణలు
Oyo: ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో త్వరలోనే ఐపీఓకి వెళ్లేందుకు వెళ్తోన్న విషయం తెలిసిందే. నవంబర్‌లో కంపెనీ $7-8 బిలియన్ విలువతో DRHP దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓయోపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.

ఫిన్‌టెక్ వ్యవస్థాపకుడి ఆరోపణ
ఫిన్‌టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు మోహిత్ గాంగ్ ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ OYO రూమ్స్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన చేస్తున్న ఆరోపణల ప్రకారం.. OYO రిటైల్ ఇన్వెస్టర్లను మోసం చేస్తూ “డేలైట్ హైస్ట్” (పగటి దోపిడీ) చేస్తున్నట్లు ఆరోపించారు. అక్టోబర్ 27న విడుదల చేసిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా OYO కంపెనీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుందని తెలిపారు. వాటిలో ముఖ్యమైనది బోనస్ కాంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ (CCPS) జారీ చేయడం.
పోస్టల్ బ్యాలెట్‌లోని మూడు కీలక ప్రతిపాదనలు
OYO పోస్టల్ బ్యాలెట్‌లో మూడు ప్రధాన ప్రతిపాదనలు ఉన్నాయి:
అథరైజ్డ్ క్యాపిటల్ పెంపు
బోనస్ CCPS జారీ
స్వెట్ ఎక్విటీ మంజూరు
మోహిత్ గాంగ్ ప్రకారం.. ఈ మూడింటిలో రెండో ప్రతిపాదన బోనస్ CCPSలోనే పెద్ద మోసం దాగి ఉందన్నారు. కంపెనీ ఇచ్చిన స్పందన గడువు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండటంతో, సాధారణ ఇన్వెస్టర్లు ఆ నోటీసును గమనించకపోవచ్చని చెప్పారు.
క్లాస్ A, క్లాస్ B షేర్ల తేడా
మోహిత్ గాంగ్ వివరణ ప్రకారం, ఈ స్కీంలో రెండు రకాల షేర్లు ఉన్నాయి: Class A, Class B.
Class A ఇన్వెస్టర్లు స్పందించకపోతే, ప్రతి 6,000 షేర్లకు కేవలం ఒక షేర్ మాత్రమే లభిస్తుంది.
Class B ఇన్వెస్టర్లు ఆప్ట్ ఇన్ చేస్తే, కంపెనీ మర్చెంట్ బ్యాంకర్లను నియమించినప్పుడు, మరింత అనుకూలమైన మార్పిడి నిష్పత్తి లభిస్తుంది.
ఉదాహరణకు, Class B ఎంచుకున్న ఇన్వెస్టర్లకు ప్రతి 6,000 షేర్లకు 1,109 అదనపు షేర్లు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇది దాదాపు 18.5% లాభం అని గాంగ్ అన్నారు.
"మూడు రోజుల గడువు – సాధారణ ఇన్వెస్టర్లకు నష్టం"
గాంగ్ తన X (మాజీ ట్విట్టర్) పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.. “Class B స్పష్టమైన విజేత. కానీ కేవలం 3 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం ద్వారా సాధారణ ఇన్వెస్టర్లకు ఆ అవకాశం కోల్పోయేలా చేస్తున్నారు. ఇది పూర్తిగా ఒక కార్పొరేట్ డేలైట్ హైస్ట్ లాంటిది!”. అంతేకాకుండా, ఈమెయిల్‌తో పాటు పత్రాల సమర్పణ అవసరం ఉండటం కూడా చిన్న ఇన్వెస్టర్లకు అవరోధమని ఆయన అన్నారు.
ఇతర నిపుణుల స్పందన
Capitalmind AMC CEO దీపక్ షెనోయ్ కూడా ఈ విషయం పై స్పందించారు. “షేర్‌హోల్డర్లు జాగ్రత్తగా ఉండాలి,” అని ఆయన Xలో పేర్కొన్నారు. ఇకపోతే, OYO త్వరలోనే తన IPO (Initial Public Offering) కోసం సిద్ధమవుతోంది. నవంబర్‌లో కంపెనీ $7-8 బిలియన్ విలువతో DRHP (Draft Red Herring Prospectus) దాఖలు చేయనున్నట్లు సమాచారం.