ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన కొడుకుని అతి దారుణంగా హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు. కానీ... తండ్రి చేస్తున్న అకృత్యాన్ని కూతురు చూస్తూ ఊరుకోలేకపోయింది. కాపాడే ప్రయత్నం చేస్తే తన ప్రాణాలకు ముప్పు వస్తుందనే భయంతో...ఆ సాహసం చేయలేకపోయింది. కానీ... తండ్రి చేస్తున్న క్రూరత్వాన్ని తన సెల్ ఫోన్ లో వీడియో తీసింది. ఆ వీడియో ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరుకి చెందిన వ్యక్తి(45) ఓ చిట్ ఫండ్ కంపెనీని నిర్వహించేవాడు. అందులో నష్టం రావడంతో అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో అప్పుల వారి బాధల నుంచి తప్పించుకునేందుకు ఓ పథకం వేశాడు. అందులో భాగంగానే భార్యను, కొడుకుని(12) చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అప్పుల బాధతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామంటూ పోలీసులకు వివరించాడు. 

అయితే... తండ్రి ఘాతుకాన్ని ముందుగానే వీడియో తీసిన కుమార్తె(17) ... పక్కింటి వారి సహాయంతో ఆ వీడియోని పోలీసులకు అందించింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. బెడ్ మీద ఉన్న బెడ్ షీట్ ని కొడుకు మెడకు చుట్టేసి... ఫ్యాన్ కి వేలాడదీయడం.. తట్టుకోలేని బాలుడు గిలగిల కొట్టుకోవడం అంతా వీడియోలో రికార్డు అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.