బెంగళూరు: బెంగళూరులోని మడివాళ మహిళ సంరక్షణ కేంద్రంలో రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ పరస్పరం గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గొడవకు దిగినట్లు తెలిసింది. ఈ పరిస్థితి రావడానికి నువ్వంటే నువ్వు కారణమని వారిద్దరు పోట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిద్దరు మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.

డ్రగ్స్ కేసును మరో కోణంలో విచారించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. రాగిణి, సంజనాలపై విడిగా కేసు నోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. వారిద్దరు బినామీల పేరుతో పెద్ద మొత్తంలో సంపాదించినట్లు భావిస్తున్నారు. వారిద్దరిని ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

కోట్లాది రూపాయల లావాదేవీలు సాగుతుండడంతో కేసు నమోదు చేసినట్లు కర్ణాటక, గోవాలకు చెందిన ఈడీ అధికారులు తెలిపారు. సీసీబీ కస్టడీలో ఉ్న వీరేశ్ ఖన్నా, రాహుల్, ప్రశాంత్ రంగా, ప్రతీక్ శెట్టిలను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. వారిని తమ కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోర్టును అర్థించారు.

ఇదిలావుంటే, డ్రగ్స్ కేసులో అరెస్టయిన రవిశంకర్, రాహుల్, వైభవ్ జైన్, ప్రశాంత్ రంకా, నియాజ్, ప్రతీక్ శెట్టిలకు కేసీ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు, రక్తం, మూత్రం, తల వెంట్రుకల నమూనాలను సేకరించి ల్యాబరేటరీకి పంపించారు. బంగారం వ్యాపారి అయిన వైభవ్ జైన్ ను రాగిణి ద్వివేదికి సన్నిహితుడిగా అధికారులు గుర్తించారు.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ దర్యాప్తు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పరీక్షల నిమిత్తం రక్తం ఇవ్వబోనంటూ అధికారులతో సంజనా గల్రానీ గొడవకు దిగగా రాగిణి ద్వివేది మరింత విచిత్రంగా ప్రవర్తించింది. పరీక్షల నిమిత్తం మూత్రం ఇవ్వాలని వైద్య సిబ్బంది చిన్న సీసా ఇవ్వగా రాగిణి అందులో నీళ్లు నింపి ఇచ్చింది. దాంతో అధికారులు ఆమెపై మండిపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఓ మహిళా పోలీసు సాయంతో మరోసారి ఆ పరీక్షలు నిర్వహించారు.