బెంగాల్ గిరిజన యువతి ఘటన : టీఎంసీ అంటే తాలిబాన్ మనస్తత్వం, సంస్కృతి.. బీజేపీ అధికార ప్రతినిథి తీవ్ర విమర్శలు..
బెంగాల్ లో రేపిస్టులు రక్షించబడుతున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని.. టీఎంపీ తాలిబాన్ లా వ్యవహరిస్తోందని..టీఎంసీ అంటే...తాలిబానీ మాన్సిక్త అండ్ కల్చర్ (TMC) అంటూ మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి షాహజాద్.
వెస్ట్ బెంగాల్ : బిజేపీ అధికార ప్రతినిథి షహజాద్ పూనావాలా బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో మహిళలకు భద్రత లేదంటూ విమర్శలు గుప్పించారు. సందేశ్‌ఖాలీ నుంచి మాల్డావరకు మహిళలకు భద్రత కరువవుతోందని.. దారుణమైన అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నారని అన్నారు.
మాల్డాలో మరో క్రూరమైన అత్యాచారం, హత్య కేసు గురించి మాట్లాడుతూ.. ఓల్డ్ మాల్డాలోని భబుక్ గ్రామంలోని ఇటుక బట్టీలో తొమ్మిదో తరగతి గిరిజన విద్యార్థి, ముఖం చిధ్రం అయ్యి, విగతజీవిగా కనిపించిన విషయాన్ని ప్రస్తావించారు. మాల్దాలో ఇలాంటి కేసు ఇది మొదటిసారి కాదన్నారు. ఇటీవల 25 ఏళ్ల యువతి అత్యాచారానికి గురై, అర్ధనగ్నంగా ఆమె మృతదేహం దొరికిందని తెలిపారు. బెంగాల్‌లో ఇలాంటి ఉదంతాలు చాలానే జరుగుతున్నాయన్నారు.
ముస్లిం వివాహ చట్టం రద్దు.. అసోం సంచలన నిర్ణయం..
రేపిస్టులు రక్షించబడుతున్నారని, వారిని కాపాడుతున్నారని.. దీనికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. టీఎంసీ అంటే...తాలిబానీ మాన్సిక్త అండ్ కల్చర్ (TMC) అంటూ మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం సాయంత్రం పాడుబడిన ఇటుక బట్టీలో, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన మైనర్ బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బాధిత మైనర్ కుటుంబ సభ్యులు ఆమెపై మొదట అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాన్ని ఇటుక బట్టీలో పడవేశారని ఆరోపించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని, ఆమెపై అత్యాచారం జరిగిందా అనేది కూడా తేలుతుందని స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి.
గురువారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వారు రాత్రంతా ఆమె కోసం వెతికారు. శుక్రవారం కూడా గాలింపు చేపట్టారు. చివరగా, ఆమె శరీరం పాడుబడిన ఇటుక బట్టీలో, వాడుకలో లేని కొలిమి వెనుక దొరికింది. ఆమె ముఖం గుర్తుపట్టరాకుండా చిధ్రమై ఉంది.
"ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నాం. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో సరైన దర్యాప్తును డిమాండ్ చేస్తున్నాం. మాది చాలా పేద ఆర్థిక నేపథ్యం. అయినా, ఆమెను చదివించాలని స్థానిక పాఠశాలలో చేర్పించాను" అని బాధితురాలి తండ్రి మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ కేసులో విచారణ ప్రారంభించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.