ఒడిషా రైలు ప్రమాదం .. బీజేపీపై ఎదురుదాడి, గోద్రా ఘటనను గుర్తుచేసిన మమతా బెనర్జీ
ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. 2002 గోద్రా ఘటనను ఆమె మరోసారి గుర్తుచేశారు.

ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రధాని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు నా పక్కనే నిలబడి వున్నారని చెప్పారు. తాను గతంలో రైల్వే మంత్రిగా పనిచేసినందున చాలా విషయాలు చెప్పాలనుకున్నట్లు తెలిపారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో anti-collision device ఎందుకు లేదని మమత ప్రశ్నించారు. దేశంలో రైల్వేను విక్రయించడం ఒక్కటే మిగిలి వుందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న రైల్వే మంత్రి నా పక్కనే వున్నప్పుడు అతను రైళ్లు ఢీ కొట్టకుండా నియంత్రించే పరికరం గురించి ప్రస్తావించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మమత ప్రశ్నించారు. ‘‘దాల్ మే కుచ్ కాలా హై’’ (పప్పులో ఏదో నలుపు ఉంది) అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
వారు (బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం) చరిత్రను మార్చగలవారు, ఎంతటి సంఖ్యనైనా మార్చగలరని వ్యాఖ్యానించారు. ప్రజలతో నిలబడటానికి బదులుగా వారు నన్ను, నితీష్ జీ, లాలూజీని దుర్భాషలాడుతున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. గోద్రాలో నడుస్తున్న రైలులో (2002 గోద్రా రైలు దహనం) మంటలు ఎలా చెలరేగాయి. అప్పుడు ఎంతోమంది చనిపోయారని, దీనికి కనీసం క్షమాపణలు చెప్పాలని మమత డిమాండ్ చేశారు.
జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై బీజేపీ మమతను టార్గెట్ చేసింది. దీంతో ఆమె జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఘటనకి కౌంటర్‌గా గోద్రా ఘటనపై మమత మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడంపై కూడా మమత విరుచుకుపడ్డారు. రైల్వేల నిర్వహణకు వెచ్చించిన కొద్దిపాటి సొమ్మును ఖర్చు చేయడం లేదన్నారు. మోడీ పేరుతోనే అన్నీ జరుగుతున్నాయన్నారు. కానీ అభివృద్ధికి విఘాతం కలుగుతోందని.. 100 రోజుల పనికి బీజేపీ డబ్బులు ఇవ్వడం లేదని మమత దుయ్యబట్టారు. అందుకే రాష్ట్ర ప్రజలు పనుల కోసం బయటకు వెళ్తున్నారని.. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు కూడా చోరీకి గురయ్యాయని మమత ఆరోపించారు. తమ వద్ద ఉన్న సమాచారం, కేంద్రం ఇచ్చే సమాచారంతో సరిపోలడం లేదన్నారు.
అలాగే తాజా ప్రమాదంలో మరణాల సంఖ్యపైనా ఆమె కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రానికి చెందిన 61 మంది ప్రాణాలు కోల్పోయారని, కానీ 182 మంది జాడ ఇంకా తెలియరాలేదని మమత తెలిపారు. ఇంతకీ వందే భారత్ ఇంజినల్‌లు సరైన ప్రమాణాలతోనే వున్నాయా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఒక రాష్ట్రం నుంచి 182 మంది కనిపించకుండాపోయి.. 61 మంది చనిపోయినట్లుగా ప్రకటిస్తే ఆ గణాంకాలు సరైనవా అని మమత నిలదీశారు. తాను రైల్వే మంత్రిగా వున్న సమయంలో ప్రవేశపెట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని ఆమె దుయ్యబట్టారు.
తన హయాంలో నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలలో జరిగిన రైలు ప్రమాదాల్లో చాలా మంది మరణించారని కొందరు ప్రచారం చేస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రైల్వే మంత్రిగా వున్నప్పుడు దేశంలో కొత్త సిగ్నల్ సిస్టమ్, యాంటీ కొలిజన్ డివైజ్‌ను ప్రవేశపెట్టానని ఆమె తెలిపారు. వందే భారత్ అనే పేరు బాగుందని.. కానీ ఓ రోజున చెట్టు కొమ్మ పడిపోయినప్పుడు ఏం జరిగిందో దేశం చూసిందని మమతా బెనర్జీ చురలంటించారు.
అంతకుముందు శనివారం ఒడిషాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాద స్థలిని మమతా బెనర్జీ సందర్శించారు. అనంతరం అక్కడే వున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఆపై ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని అత్యుత్తమ రైళ్లలో ఒకటన్నారు. తాను మూడు సార్లు రైల్వే మంత్రినని.. తనకు తెలిసినంతలో ఒడిషా రైలు ప్రమాదం 21వ శతాబ్ధంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంగా పేర్కొన్నారు. ఇలాంటి కేసులను రైల్వే సేఫ్టీ కమీషన్‌కు అప్పగిస్తారని.. వారు దర్యాప్తు చేసి నివేదిక ఇస్తారని మమత అన్నారు. తనకు తెలిసినంతలో ఈ రెండు రైళ్లలో anti-collision device లేదన్నారు. అది వుండుంటే ఈ దుర్ఘటన జరిగి వుండేది కాదన్నారు.