రోజులు గడుస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వేడి చల్లారడం లేదు. తాజాగా దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీ అనుకోకుండా తీసినది కాదన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీ అనుకోకుండా తీసినది కాదన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే డాక్యుమెంటరీ రూపొందించారని ఆయన ఆరోపించారు. ఒకవేళ డాక్యుమెంటరీ తీయాలనుకుంటే చాలా అంశాలు వున్నాయని.. 1984 సిక్కు అల్లర్లు, ఇందిరా గాంధీ మరణంపై ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదని జైశంకర్ మండిపడ్డారు. భారత్‌లో ఎన్నికల సీజన్ ప్రారంభమైందో లేదో తెలియదని.. కానీ లండన్, న్యూయార్క్‌లో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల సీజన్ ప్రారంభమైందని జైశంకర్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రోద్బలంతోనే బీబీసీ డాక్యుమెంటరీ తయారైందని విదేశాంగ మంత్రి ఆరోపించారు. రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా జరుగుతూ వుంటాయని కేంద్ర వ్యాఖ్యానించారు. 

కాగా..గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లు, ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తీరుపై బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ బీబీసీ తీసిన రెండు పార్టుల డాక్యుమెంటరీ సిరీస్‌ (ఇండియా: ది మోడీ కొశ్చన్) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ డాక్యుసిరీస్ దుష్ప్రచారం చేసేదిగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. బీబీసీ డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని యూట్యూబ్, ట్విట్టర్‌లకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద డాక్యుమెంటరీని సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఛానెల్‌లలో నిషేధించబడింది. అయితే కొంతమంది విద్యార్థులు దీనిని దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో ప్రదర్శించారు. డాక్యుమెంటరీకి సంబంధించిన ఎలాంటి క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది.

ALso REad: బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

అయితే భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన దాడులు (ఫిబ్రవరి 16)గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగిశాయి. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులను అధికార బీజేపీ సమర్థించింది. ఏ సంస్థ కూడా చట్టానికి అతీతం కాదని పేర్కొంది. చట్టానికి లోబడే సోదాలు జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మంగళవారం అన్నారు. బీబీసీని ప్రపంచంలో అత్యంత భ్రష్టమైన సంస్థ అని ఆయన వర్ణించారు. అదే సమయంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా స్పందించారు. ఆయన కూడా ఐటీ దాడులను సమర్థించారు. ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదనీ, బీబీసీ ఢిల్లీ, ముంబయి ఆఫీసుల్లోని సోదాల గురించి పూర్తి వివరాలను ఐటీ శాఖ ఇస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ అన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు

మరోవైపు .. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులను పాత్రికేయ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ఖండించాయి. ఈ సోదాలు.. పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని విమర్శించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు చేయాలని మేం అడుగుతుంటే ప్రభుత్వం బీబీసీ వెంట పడుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి' అంటూ చురుకలాంటించారు.