బహుభార్యత్వంపై నిషేధం విధించే ఆలోచనలు అసోం రాష్ట్రం చేపడుతున్నది. ఈ నిర్ణయం సాకారం కావడానికి ఏవైనా సవాళ్లు ఉన్నాయా? చట్టపరమైన సవాళ్లు ఏమిటీ? అనే విషయాలను పరిశీలించడానికి నిపుణులతో కమిటీ వేసినట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
గువహతి: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం కీలక ప్రకటన చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు ఓ అడుగు వేసేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. బహుభార్యత్వాన్ని రాష్ట్రంలో నిషేధించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఉండదా? ఇతర చట్టపరమైన సమస్యలను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? అనే విషయాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించి చెప్పనుంది. ముస్లిం పర్సనల్ లా (షరియత్) యాక్ట్ 1937, ఆర్టికల్ 25లను ఈ కమిటీ పరిశీలించనుంది. భాగస్వాములందరితో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సీఎం హిమంత ట్వీట్ చేసి వెల్లడించారు.
ముస్లింలో అధికంగా కనిపించే బహుభార్యత్వం, నికా హలాలా సంప్రదాయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లు విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం వేసింది.
అయితే, ఈ రాజ్యాంగ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తాలు పదవీ విరమణ అయ్యారని, కాబట్టి, ఈ ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తులను తీసుకోవాల్సి ఉన్నదని ధర్మాసనం పేర్కొంది.
