Bajrang Dal: బజరంగ్ దళ్ శిబిరంలో కార్యకర్తలు ఎయిర్ గన్‌లతో శిక్షణ తీసుకుంటున్న ఫోటో, వీడియో వైరల్‌గా మారింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా.. ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.  రాజకీయ పార్టీలు విమర్శలు చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే ఆత్మరక్షణ కోసం ఈ మేరకు శిక్షణ ఇస్తున్నట్లు బజరంగ్‌ దళ్‌ పేర్కొంది. కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నంపేటలోని సాయిశంకర్ విద్యాసంస్థలో ఈ ఘటన జరిగింది.  

Bajrang Dal: కర్నాటకలో మరో వివాదం తలెత్తింది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎయిర్ గన్‌లతో శిక్షణ తీసుకుంటున్నట్లు , 'త్రిశూల దీక్ష' చేస్తున్నట్లు చెబుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. బజరంగ్ దళ్ శిబిరంలో 'శౌర్య శిక్షణా వర్గ్ పేరిట‌.. క‌ర్నాట‌క‌లోని కొడగు జిల్లా (కర్ణాటకలోని) పొన్నంపేటలోని సాయి శంకర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ శిబిరం మే 5 నుండి 11 వరకు సాగిన‌ట్టు తెలుస్తోంది. ఈ శిబిరంలో దాదాపు 400 మంది బ‌జ‌రంగ్ కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. వారికి ఎయిర్‌ పిస్టల్స్‌, త్రిశూలాలతో ఆయుధ శిక్షణ ఇచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

కాగా, ఆయుధ శిక్షణపై విప‌క్షాల నుంచి భారీ ఎత్తున‌ విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడగు జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలతో సహా పలువురిపై ఆరోపణలు చేసింది. అయితే ఆత్మరక్షణ కోసం ఈ మేరకు శిక్షణ ఇస్తున్నట్లు బజరంగ్‌ దళ్‌ పేర్కొంది. ఆయుధ‌ శిక్ష‌ణ‌పై విమ‌ర్శలు రావ‌డంతో ఆయుధాలు ఇవ్వలేదని, పాఠశాల ప్రాంగణాన్ని చాలా ఏళ్లుగా శిక్షణ తరగతులకు ఉపయోగిస్తున్నారని, వారికి ఆయుధ శిక్షణపై అవగాహన లేదని సంబంధిత సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

 తమిళనాడు, పుదుచ్చేరి, గోవా వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జి దినేష్ గుండూరావు ట్వీట్ చేస్తూ.. ‘‘బజరంగ్ దళ్ సభ్యులకు ఆయుధ శిక్షణ ఎందుకు ఇస్తున్నారు? ఎలాంటి లైసెన్స్ లేకుండా తుపాకీలకు శిక్షణ ఇవ్వడం నేరం కాదా? ఇది ఆయుధ చట్టం, 1959, ఆయుధ నియమాలు, 1962 ఉల్లంఘన కాదా? మరి ఈ కార్యకలాపంలో భాజపా నేతలు ఎందుకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు? అని ప్రశ్నించారు.

ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ట్వీట్ చేశారు. చాలా మంది యువత తమ కలలను నెరవేర్చుకోవడంలో బిజీగా ఉన్నారని, కానీ.. కర్ణాటకలోని బజరంగ్ దళ్ మతం పేరుతో హింసను వ్యాప్తి చేసేలా శిక్షణ ఇస్తూ యువత జీవితాలను నాశనం చేస్తోంది. దీన్ని ఆపాలి డిమాండ్ చేసింది. ఈ విషయమై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలప‌డం గ‌మ‌నార్హం. 

మరోవైపు.. ఈ ఘ‌ట‌న‌పై విమర్శలు, ఆరోపణలు భారీ ఎత్తున్న వెల్లువెత్త‌డంతో బజరంగ్‌ దళ్‌ స్పందించింది. కేవలం ఆత్మరక్షణ కోసమే తమ కార్యకర్తలకు ఈ త‌ర‌హా శిక్షణ ఇచ్చినట్లు బజరంగ్‌ దళ్‌ నేత రఘు సకలేష్‌పూర్ వివ‌రించారు. శిక్షణకు వినియోగించిన ఎయిర్‌ పిస్టళ్లు, త్రిశూలాలు ఆయుధ చట్టం ఉల్లంఘటన కిందకు రావని చెప్పారు. ఈ శిబిరంలో వెయిట్ లిప్టింగ్ , లాంగ్‌ జంప్‌, మంకీ రోప్‌ వంటి క్రీడ‌ల్లో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.