Asianet News TeluguAsianet News Telugu

అల్లోపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ ఎఫ్ఐఆర్‌లపై స్టే ఇవ్వండి: సుప్రీంకోర్టుకెక్కిన బాబా రాందేవ్

అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏకంగా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. 

Baba Ramdev moves Supreme Court seeking stay on multiple FIRs ksp
Author
new delhi, First Published Jun 23, 2021, 7:05 PM IST

అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏకంగా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌ల మీద ప్రొసీడింగ్స్ చేపట్టరాదని కోరుతూ బాబా రాందేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిని కొట్టివేసేలా చూడాలని ఆయన అభ్యర్థించారు. అల్లోపతిపైనా, డాక్టర్లపైనా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా పలు వైద్య సంఘాలు వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి.

దీంతో ఆయనపై ఆయా పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. అల్లోపతిని స్టుపిడ్ మెడిసిన్ అని, దీనివల్లే ఎంతోమంది కోవిడ్ రోగులు మృతి చెందుతున్నారని రాందేవ్ బాబా ఆరోపించారు. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ శాఖ అయితే బాబా రాందేవ్ 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్టాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్‌లు దాఖలైన విషయం తెలిసిందే..

Also Read:వ్యాక్సిన్ వేసుకొంటా, వైద్యులు దేవదూతలు: యూటర్న్ తీసుకొన్న రాందేవ్

అయితే తనను ఎవరూ అరెస్టు చేయలేరని అసలు తాను మెడికల్ మాఫియా గురించి ప్రస్తావించానే తప్ప డాక్టర్లను కించపరచలేదని బాబా రాందేవ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన వ్యాఖ్యలకు అప్పుడే క్షమాపణలు చెప్పానన్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఘాటుగా లేఖ రాసిన తరువాత బాబా రామ్ దేవ్ తన వైఖరి మార్చుకున్నారు. కోవిడ్ రోగులకు సేవలు….. చికిత్సలు చేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిపై తనకు గౌరవం ఉందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios