న్యూఢిల్లీ:త్వరలో తాను కూడ కరోనా వ్యాక్సిన్ తీసుకొంటానని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు. వైద్యులు దేవ దూతలంటూ ఆయన ప్రశంసించారు. అల్లోపతి వైద్యంపై కరోనా వ్యాక్సిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన  యోగా గురువు యూటర్న్ తీసుకొన్నారు. 

 తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకమని ఆయన  ప్రకటించారు. అంతేకాదు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ  గతంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను  త్వరలోనే వ్యాక్సిన్ తీసుకొంటానని చెప్పారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని తెలిపారు. 

also read:రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ: వైరస్ కట్టడిలో విఫలం.. పతంజలి ‘‘కరోనిల్‌’’పై నేపాల్ నిషేధం

 ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు. కానీ అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని  ఆయన కోరారు.. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని ఆయన కోరారు. వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందన్నారు. ముఖ్యంగా  కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్‌ పేర్కొన్నారు.

గతంలో రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా వేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, మోడీకి  రాందేవ్ వ్యాఖ్యలపై ఐఎంఏ  లేఖ రాసింది. రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ ఐఎంఏ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జూలై 13వ తేదీకి వాయిదా వేసింది.