ఇది ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మాట్లాడాల్సిన సమయం అని, కానీ దీనిపై ఎవరూ నోరు విప్పరని ఎన్సీపీ అధినేత శరద్ ప‌వ‌ర్ అన్నారు. ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మసీదుల్లోని లౌడ్ స్పీకర్లపై వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో శరద్ పవర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మసీదుల్లో లౌడ్ స్పీకర్ల సౌండ్ పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్య‌ల‌పై మొద‌టి సారిగా ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్ స్పందించారు. మ‌త విద్వేశాల‌ను రెచ్చ‌గొట్టి, స‌మాజంలో గంద‌ర‌గోళం సృష్టించేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. ఇప్పుడు దేశంలో ద్ర‌వోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగిపోతుంద‌ని, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడ‌ర‌ని రాజ్ ఠాక్రేను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. 

మ‌హావికాస్ అఘాడి ప్రభుత్వం మే 3లోగా మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్లను తొలగించకపోతే రాష్ట్రవ్యాప్త నిరసనలు చేస్తాన‌ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు. త‌మ డిమాండ్ల‌ను నెరవేర్చకుంటే మసీదుల బ‌య‌ట ‘హనుమాన్ చాలీసా’ ప్లే చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపాయి. 

ఈ విష‌యంలో పలువురు నాయ‌కులు స్పందిస్తున్నారు. ఇదే విష‌యంలో తాజాగా శ‌ర‌ద్ ప‌వ‌ర్ మాట్లాడారు. ‘‘ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడే సమయం వచ్చింది కానీ ఎవరూ దాని గురించి మాట్లాడరు ’’ అని అన్నారు. రాజ్ ఠాక్రే తాత‌, సంఘ సంస్కర్త ప్రబోధంకర్ ఠాక్రే విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆయ‌న రచనలలో మత తీవ్రవాదాన్ని విమర్శించిన విషయాన్ని గుర్తు చేయడానికి శ‌ర‌ద్ ప‌వ‌ర్ ప్రయత్నించారు. ‘‘ మేము ప్రబోధంకర్‌ని చదివాము. కానీ బహుషా అయన కుటుంబ సభ్యులు చదివి ఉండకపోవచ్చు ’’ అని అన్నారు.

రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ కూడా వారం రోజుల కిందట స్పందించారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగిస్తే నిరుద్యోగ సమస్య ఏమైనా తొలిగిపోతుందా అని అన్నారు. ‘‘ ఇన్ని రోజులు కమ్యూనిటీలు, మతాల మధ్య చీలికలను రానివ్వ‌కుండా, సమాజంలో మత సామరస్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచగలిగాము. కానీ కొన్ని పార్టీల నాయకులు లౌడ్ స్పీకర్లను (హనుమాన్ చాలీసా వినిపించేందుకు) అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే వ్యక్తులు మహారాష్ట్రను, దేశాన్ని ఎటువైపు నడిపిస్తారో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఠాక్రే పేరును ప్రస్తావించకుండా పవార్ అన్నారు.

‘‘ ఇంకా ఇతర సమస్యలే లేవా ? ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల రొట్టె, వెన్న సమస్య పరిష్కారం అవుతుందా ? COVID-19 మహమ్మారి సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన యువకులకు తిరిగి ఉద్యోగాలు లభిస్తాయా? ’’ అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు స‌మాజానికి మంచివి కావ‌ని అన్నారు. 

ఇదిలా ఉండ‌గా మసీదులపై లౌడ్ స్పీకర్లను మే 3వ తేదీలోగా తొల‌గించ‌క‌పోతే తాము చెప్పింది చేసి తీరుతామ‌ని రాజ్ ఠాక్రే మంగ‌ళ‌వారం నాడు త‌న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ‘‘ శివసేన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మే 3 లోపు మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే MNS కార్యకర్తలు మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా వాయిస్తారు. లౌడ్ స్పీకర్‌లు ప్రతీ ఒక్కరికీ ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఇది మతపరమైనది కాదు. ఇదొక సామాజిక సమస్య. మేము ఈ అంశంపై వెనక్కి వెళ్లబోము. మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి, అనే ఇదే విష‌యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాను” అని రాజ్ ఠాక్రే అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు.