అయోధ్యలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్టను పురస్కరించుకుని దేశ విదేశాల్లోని భారతీయులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో మెక్సికోలోని క్వెరెటారో నగరంలో ఎన్ఆర్ఐలు ఆ దేశంలో రామాలయాన్ని నిర్మించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ జాతీయుడు పూజారిగా వ్యవహరించడం గమనార్హం.
Ayodhya Ram Mandir Pran Pratishtha : రామజ్యోతిని వెలిగించిన ప్రధాని నరేంద్ర మోడీ

అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని అతిరధ మహారథులు సమక్షంలో దేశ ప్రజలందరూ భక్తిపారవశ్యంతో వీక్షిస్తుండగా రామమందిరంలో రామయ్యకు ప్రాణప్రతిష్ట చేసారు ప్రధాని.
మెక్సికోలో ప్రారంభమైన తొలి రామ మందిరం.. పూజారిగా అమెరికన్
అయోధ్యకు బీజేపీ రైళ్లు.. షెడ్యూల్ ఇదే , తెలంగాణలో ఎంతమందికి ఛాన్స్ అంటే .?
అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట ఘట్టం ముగిసింది. మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జనవరి 29 నుంచి ఈ ఆస్థా రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అయోధ్యకు భక్తులను పంపనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నారు.
రామజ్యోతిని వెలిగించిన ప్రధాని నరేంద్ర మోడీ
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామజ్యోతిని వెలిగించి, దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు
అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో మరో రామాలయం
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. అయోధ్యకు దాదాపు 1000 కి.మీ దూరంలో మరో రామాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్‌లో ఈ రామాలయ నిర్మాణం జరిగింది. దీనికి అవసరమైన నిధులన్నీ స్థానికులే సమకూర్చుకున్నారు.
అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట : భక్తుడికి గుండెపోటు, ప్రాణాలు నిలబెట్టిన వాయుసేన
అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఓ భక్తుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. రామకృష్ణ శ్రీవాస్తవ అనే భక్తుడికి గుండెపోటు రాగా.. వాయసేనలోని BHISHM క్యూబ్ బృందం వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. గోల్డెన్ అవర్‌లో చికిత్స లభించడంతో శ్రీవాస్తవ ప్రాణం నిలిచింది.
32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమా భారతి, సాధ్వి రితంబర
1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉమా భారతి, సాధ్వి రితంబరలు దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారిద్దరూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
సరయూ నదీ తీరంలో దీపోత్సవం
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం దీపోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సరయూ నదీ తీరంలో భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు.
అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట : అతిథులకు 7 రకాల ప్రసాదాలు
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా వేడుక కనులపండుగా జరిగింది. దేశ విదేశాల నుంచి దాదాపు 7000 మంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరందరికి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రసాదం అందజేయాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా లక్నోలో 15 వేల స్వీట్ బాక్సులను తయారు చేయించింది. ఇందులో రెండు లడ్డూలు, బెల్లం రేవ్ డీ, రామదాన చిక్కీ, అక్షతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిద వున్నాయి.
దేశమంతా రామమయం : సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్
అయోధ్య రామ మందిరంలో ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ తీరంలో రామమందిర నమూనాను తీర్చిదిద్దారు. రామాలయంతో పాటు నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రూపం కనువిందు చేస్తోంది.
రామ్ లల్లా సేవలో అంబానీ ఫ్యామిలీ
అయోధ్య రామ మందిరం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖేష్ దంపతులతో పాటు వారి కుమారులు, కోడళ్లు, కూతురు అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంబానీ ఫ్యామిలీ దిగిన ఫోటో వైరల్ అవుతోంది.
అయోధ్యను రోజుకు ఎంతమంది దర్శించనున్నారో తెలుసా..?
భారతీయుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం సాకారమైంది. రామ్ లల్లా విగ్రహా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వున్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ప్రతిరోజూ 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శించనున్నారని అంచనా. ఈ మేరకు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ గ్రూప్ పేర్కొంది. దీని ప్రకారం ఏడాదికి 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం వుంది.
అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట : హాజరైన బాలీవుడ్ స్టార్ కపుల్స్
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆలయ నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రెటీలు అలియా భట్ - రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు.
రేపటి నుంచి భక్తులకు రామ్ లల్లా దర్శనం
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామ్ లల్లా దర్శనమివ్వనున్నారు. వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం లభించనుంది. తొలి స్లాట్ ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గటల వరకు రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ
అయోధ్య రామ మందిర ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, ఇంజనీర్ల బృందంపై మోడీ పూల వర్షం కురిపించారు.
అయోధ్యకు రావడం నా అదృష్టం : రాం చరణ్
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అద్భుతమన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది దేశంలోని ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవమన్నారు. తాను అయోధ్యకు రావడం తన అదృష్టమన్నారు .
అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట .. నా కళ్లలోంచి నీళ్లొచ్చాయి : పవన్ కళ్యాణ్
రామకార్యం అంటే రాజ్య కార్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సెల్ఫీ దిగి దానిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవాళ తాను భావోద్వేగానికి గురయ్యానని, ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఈ భూమ్మీద నా కంటే అదృష్టవంతులు లేరు : రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి
రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని తానేనని ఆయన అన్నారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్ లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై వుంటాయని యోగిరాజ్ పేర్కొన్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు యోగిరాజ్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడిపై సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు.
జనవరి 22 ఇకపై రామ్ దివాళీ : ముఖేష్ అంబానీ
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీలు అయోధ్యకు చేరుకుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది చారిత్రాత్మక దినమని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జనవరి 22న ఇకపై రామ్ దివాళీగా జరుపుకుంటారని అన్నారు.
అయోధ్యలో మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్ సెల్పీ
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్‌లు అయోధ్య వేదిక వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ దిగారు.
అయోధ్య : ఆలయాన్ని నిర్మించిన కార్మికులపై పూలు జల్లిన మోడీ
అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులు, ఇతర సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో వీరిపై స్వయంగా పూలు జల్లారు మోడీ.