Ayodhya Deepostav 2025 : అయోధ్యలో ఈ దీపావళికి వైభవంగా దీపోత్సవ్ 2025 నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 56 ఘాట్‌లు లక్షలాది దీపాలతో వెలిగిపోనున్నాయి.  

Ayodhya Deepostav 2025 : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో రామజన్మభూమి అయోధ్యలో ఈసారి కూడా దీపోత్సవ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం ఈ దీపోత్సవ్ 2025 ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఘాట్‌లపై మార్కింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ కార్యక్రమం శ్రీరాముని పవిత్ర నగరాన్ని ప్రకాశవంతం చేస్తుంది. 

అయోధ్య దీపోత్సవ్ 2025 సన్నాహాలు 

డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కల్నల్ డాక్టర్ బిజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో దీపోత్సవ్ 2025 పనులు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయ బృందం ఘాట్‌లను క్రమబద్ధంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా మాట్లాడుతూ… తన పర్యవేక్షణలో ఘాట్‌లను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. దీపాలను అందంగా అమర్చడానికి ప్రతి బ్లాక్‌ను 4.5 చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కింగ్ చేస్తున్నామని… భక్తుల రాకపోకల కోసం 2.5 అడుగుల వెడల్పు గల మార్గాలను వదిలివేస్తున్నామని ఆయన తెలిపారు.

దీపోత్సవం కోసం మొత్తం 56 ఘాట్‌లను ఎంపిక చేశారు… ఇక్కడ లక్షలాది దీపాలు అయోధ్యను ప్రకాశవంతంగా మారుస్తాయి. మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ రంజన్ సింగ్ నేతృత్వంలోని మార్కింగ్ కమిటీ, ఇతర బృందం ఈ పనిని వారం రోజుల్లో పూర్తి చేస్తుంది. ఈ దీపోత్సవ కార్యక్రమం సజావుగా సాగేందుకు 30,000 మంది వాలంటీర్ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి దశలో ఉంది. త్వరలోనే దీపాల సరఫరా ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది.

ఈ అద్భుతమైన దీపోత్సవం ప్రపంచ వేదికపై అయోధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును మరింతగా చాటిచెప్పనుంది. అలాగే 'రామ్ కీ నగరి ప్రకాశ్ కీ నగరి (రాముడి నగరం - ప్రకాశవంతమైన నగరం)' అనే సందేశాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తుంది.