న్యూఢిల్లీ:  అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 29వ తేదీ నుండి ఈ కేసు విచారణ చేయనుంది కోర్టు

అయోధ్య వివాదంపై తొలుత ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ మార్పులు చేశారు. తొలుత పేర్కొన్న ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ యుయు లలిత్‌ స్థానంలో కొత్తగా జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ నజీర్‌లను తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే జస్టిస్‌ యుయు లలిత్‌ మాత్రం గతంలో అయోధ్య వివాదానికి సంబంధించిన కేసులో లాయర్‌గా ఉన్నందున.. తాను ఈ ధర్మాసంలో కొనసాగలేనని తెలిపారు.

తాజా నిర్ణయంతో జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌  డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ నజీర్‌లు సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ ధర్మాసనం జనవరి 29 నుంచి అయోధ్య వివాదంపై విచారణ చేపట్టనుంది. కాగా, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అయోధ్య వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనంలో జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ నజీర్‌లు  సభ్యులుగా ఉన్నారు.