దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీ జరీ చేసింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీ జరీ చేసింది. మార్చి నుంచి మే వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ 2023కి మొదటి హీట్ వార్నింగ్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వేడి-సంబంధిత అనారోగ్యంపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని విడుదల చేసింది. వేసవిలో ‘‘చేయవలసినవి, చేయకూడనివి’’తో కూడిన జాబితాను కూడా అందజేసింది.
దాహం వేయకపోయినా.. వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని సూచించింది. పౌరులు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని ఉపయోగించాలని, నిమ్మరసం, మజ్జిగ పాలు/లస్సీ, పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి తినాలని కోరింది. సన్నగా, వదులుగా ఉండే వస్త్రాలను, కాటన్ వస్త్రాలను ధరించాలని.. లేత రంగులతో కూడిన వాటిని ధరించడం ఉత్తమని పేర్కొంది. సూర్యరశ్మికి నేరుగా బహిర్గతమయ్యే సమయంలో గొడుగు, టోపీ, టవల్స్, ఇతర సంప్రదయా హెడ్ గేర్‌లను ఉపయోగించి తలను కప్పుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. స్థానిక వాతావరణ వార్తల కోసం రేడియో వినాలని, వార్తాపత్రికలు చదవాలని, టీవీ చూడాలని కోరింది. ప్రజలు భారత వాతావరణ శాఖ వెబ్‌సైట్‌ను కూడా ట్రాక్ చేయవచ్చని కూడా పేర్కొంది.
ప్రజలు బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలతో కూడిన ఇంటి లోపల ఉండాలని పేర్కొంది. “ప్రత్యక్ష సూర్యకాంతి, వేడి తరంగాలను నిరోధించండి: పగటిపూట కిటికీలు, కర్టెన్‌లను మూసి ఉంచండి. ముఖ్యంగా ఇళ్లు ఎండ తగిలే వైపు ఉన్నవారు. రాత్రి పూట చల్లటి గాలిని లోపలికి అనుమతించడానికి కిటికీలను తెరవండి’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
చల్లగా ఉన్న సమయాల్లో బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని.. ఉదయం, సాయంత్రం వేళ్లలో కార్యకలాపాలను చూసుకోనేలా రీషెడ్యూల్ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రజలను కోరింది. ఒకవేళ ఎండలో ఉంటే.. కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.
కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం.. శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఆరుబయట పని చేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు, చల్లటి వాతావరణ ప్రాంతం నుంచి వేడి వాతావరణానికి వచ్చే వ్యక్తులు అధిక ఉష్ణోగ్రతల వల్ల హాని కలిగే జాబితాలో ఉన్నారు.
‘‘ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలు మానుకోండి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవం కోల్పోవటానికి దారితీస్తాయి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు’’అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని నివారించాలని సూచించింది. పార్క్ చేసిన వాహనంలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దని తెలిపింది. వాహనం లోపల ఉష్ణోగ్రత ప్రమాదకరంగా మారవచ్చని పేర్కొంది.
కళ్లు తిరగడం లేదా మూర్ఛపోవడం, వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, అసాధారణంగా ముదురు పసుపురంగు మూత్రంతో మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, వేగంగా గుండె కొట్టుకోవడం వంటి ‘‘వేడి ఒత్తిడి’’ లక్షణాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అధిక శరీర ఉష్ణోగ్రతతో ఎవరైనా కనిపిస్తే వెంటనే 108/102కు కాల్ చేయాలని తెలిపింది.
