కాంగ్రెస్ నేత, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని శరీరంలోకి దాదాపు 24 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు సిద్ధూ పుర్రెలోనూ ఓ బుల్లెట్‌ను గుర్తించారు.
పంజాబీ సింగర్, కాంగ్రెస్ (congress) నేత సిద్ధూ మూసేవాలా (sidhu moose wala) హత్యతో దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. గత ఆదివారం స్నేహితులతో కలిసి స్వగ్రామానికి వెళ్తున్న మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు. అతని హత్య తన పనేనంటూ కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ (goldy brar) ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మూసేవాలా మృతదేహానికి జరిగిన పోస్ట్‌మార్టంలో (post mortem) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని శరీరంలోకి దాదాపు 24 బుల్లెట్లు దూసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి అతనిని ఎంత కసిగా చంపారో అర్ధమవుతోంది. మూసేవాలా పుర్రెలోనూ ఓ బుల్లెట్ ను వైద్యులు గుర్తించారు. హత్యకు గురైన రోజున మూసేవాలా తన వాహనంలో ఇద్దరు సన్నిహితులతో కలిసి వెళుతున్నారు. మూసేవాలా వాహనాన్ని అడ్డగించిన దుండగులు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు.
ఆ వాహనంలో మరో ఇద్దరు ఉన్నప్పటికీ, దుండగులు కేవలం మూసేవాలాను గురిచూసి కాల్పులు జరిపారు. దీంతో పదుల సంఖ్యలో బుల్లెట్లు అతని శరీరాన్ని ఛిద్రం చేశాయి. శక్తిమంతమైన అస్సాల్ట్ తుపాకులతో అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్లు మూసేవాలా శరీరంలోంచి అవతలి వైపుకు దూసుకెళ్లాయి. ఈ మేరకు పోస్టుమార్టం చేసిన వైద్యులు 24 బుల్లెట్ల తాలూకు 'ఎంట్రీ అండ్ ఎగ్జిట్' ఆనవాళ్లను గుర్తించారు. లోపలి అవయవాలన్నీ బుల్లెట్ గాయాలతో దెబ్బతిన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు.
Also Read:CM Bhagwant Mann: 'ఎంతటివారైనా వదిలిపెట్టం'.. సిద్దూ హత్యాపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్..
మరోవైపు.. మూసేవాలా హత్య కేసుకు (moosewala murder case) సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే.. సిద్ధూ అంత్యక్రియలు (sidhu moose wala funeral) ఆయన స్వగ్రామం మూసాలో మంగళవారం నిర్వహించారు. వేలాదిగా అభిమానులు తరలివచ్చి మూసేవాలా జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ బిడ్డ శవపేటికను కన్నీటి నడుమ ముద్దాడటం అందరినీ కలచివేసింది.
