ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్ వైజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అస్వస్థతకు గురైంది. ఆమెను హాస్పిటల్ లో చేర్పించినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించి బాధితురాలు చనిపోయింది.
మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. చదువుకునే చోట, పని చేసే చోట ఆమెపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. చిన్నారులు, ముసలి వాళ్లు అని కూడా చూడకుండా కామాంధులు వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. పరిచయం ఉన్న వారే కదా అని నమ్మి వెళ్తే అత్యాచారానికి ఒడిగడుతున్నారు. తమ కింద పని చేసే ఉద్యోగి అని కూడా చూడకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్ వైజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితురాలు మరణించింది. ‘ఇండియా టుడే’ కథనం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ లోని ఓ హౌసింగ్ సొసైటీలో జార్ఖండ్ కు చెందిన యువతి (19) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. తన అత్తతో కలిసి ఆమె జీవిస్తోంది. కాగా.. అదే హౌసింగ్ సొసైటీలో 32 ఏళ్ల అజయ్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు.
కాగా.. ఆదివారం ఆ యువతిపై అజయ్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు అస్వస్థతకు గురైంది. తోటి కార్మికులు ఆమెను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో సోమవారం ఆమె మరణించింది.
అయితే,సొసైటీ బేస్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిని తట్టుకోలేక బాధితురాలు విషం తాగారని, దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని పేర్కొన్నారు. కాగా.. ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సెక్షన్ ఆఫ్ రేప్ (376 ఐపీసీ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ వివేక్ చంద్ యాదవ్ తెలిపారు.
బేస్మెంట్ లోపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరించారని, ఇందులో సామూహిక అత్యాచారం జరగలేదని ఆయన చెప్పారు. అయితే బాధితురాలు విషం తాగి చనిపోయిందా లేక ఊపిరితిత్తుల వ్యాధి వల్ల చనిపోయిందా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
