ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం అతడి కుమారుడిని ఓ మహిళ హతమార్చింది. కుమారుడు చనిపోతే అతడు తన భార్యకు విడాకులు ఇచ్చేస్తాడని ఆమె భావించి ఈ ఘోరానికి ఒడిగట్టింది. పోలీసులు నిందితురాలని అరెస్టు చేశారు.

తనతో ప్రియుడు ఉండకపోవడానికి మొదటి భార్య, కుమారుడే కారణం అని ఓ ప్రియురాలు భావించింది. కుమారుడిని చంపితే భార్యకు విడాకులు ఇచ్చి, ఇక ప్రియుడు తన వద్దకు వచ్చేస్తాడనని ఆమె అనుకుంది. ఏ అడ్డంకీ లేకుండా జీవింతాంతం సంతోషంగా కలిసి ఉండొచ్చని ఊహించుకుంది. అందుకే ఓ పథకం వేసి ప్రియుడి కుమారుడిని చంపింది. ఎవరికీ అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలూ పాటించింది. కానీ ఆమె ఊహించికున్నట్టుగా ఏం జరగలేదు. పోలీసులు టెక్నాలజీని ఉపయోగించుకుని ఆమెను అరెస్టు చేశారు.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని రణహోలా చెందిన జితేందర్-నీలు దంపతులు వీరికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే కొంత కాలం కిందట జితేందర్ కు 24 ఏళ్ల పూజ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది వారి మధ్య సన్నిహిత్య సంబంధానికి దారి తీసింది. తనకు వివాహం అయిన విషయం చెప్పి, మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుంటానని పూజకు హామీ ఇచ్చి, ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.

కొంతకాలం తర్వాత జితేందర్ మనసు మార్చుకున్నాడు. తన తప్పును గ్రహించాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనను మార్చుకున్నాడు. 2022 డిసెంబర్ నుంచి తన మొదటి భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు. అయితే తన ప్రియుడు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడానికి కారణం అతడి కుమారుడే అని భావించింది. ఆ బాలుడిని అడ్డు తొలగిస్తే తన ప్రియుడు మొదటి భార్యకు విడాకులు ఇస్తాడని, తన దగ్గరికే వచ్చేస్తాడని ఆమె అనుకుంది.

దీని కోసం ఆమె ఓ ప్లాన్ వేసింది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం జితేందర్ ఇంటికి వెళ్లింది. నిద్రపోతున్న బాలుడిని హతమార్చింది. అనంతరం డెడ్ బాడీని బెడ్ బాక్స్ లో దాచిపెట్టి, అక్కడి నుంచి పరారైంది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు బాలుడిని బీఎల్కే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే బాలుడి మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఓ బాలుడు గొంతు నులిమిన గాయాల వల్ల చనిపోయాడని ఆ హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో ఇందర్ పురి పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగారు. ఆ ఇంటికి పూజనే చివరి సారిగా వచ్చి వెళ్లిందని గుర్తించారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుమారు 300 సీసీ టీవీలను పరిశీలించారు. నిందితురాలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా తన స్థావరాలను మారుస్తోందని గుర్తించారు. చివరికి బకర్వాలా ప్రాంతంలో పూజ ఉన్నట్టు పోలీసులు ఆదివారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నిందితురాలిపై సెక్షన్ 302 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.