Atiq Ahmed:మాఫియా , మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను శనివారం రాత్రి పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకువెళుతుండగా.. వారిపై కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Atiq Ahmed:గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ల హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ పాటు దేశవ్యాప్తంగా రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. యూపీలో చట్టబద్ధత లేదని, ఇలాంటి ఘటనల వల్ల ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం తగ్గుతుందని పలువురు విమర్శించారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. శనివారం రాత్రి 10.35 గంటలకు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ని రొటీన్ చెకప్ కోసం పోలీసు బృందం వారిని ఆసుపత్రికి చేరుకుంది. ఈ సమయంలో వారిని మీడియా చుట్టుముట్టింది. మీడియా ప్రతినిధులు వారిపై ప్రశ్నలు వర్షం కురిపిస్తుండగా.. ఆకస్మికంగా మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్ పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగలడంతో అతీక్ సోదరులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించారు. కాల్పుల అనంతరం నిందితులు లవ్లేశ్ తివారీ, సన్నీసింగ్, అరుణ్ మౌర్యా పోలీసులకు లొంగిపోయారు.
ఈ ఘటన తరువాత.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతీక్, అష్రాఫ్‌లను హత్య చేసేందుకు నిందితులకు తుపాకులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఫారెన్ మెడ్ తుఫాకులను వారికి ఎవరు అందించారు. వాటి ధర ఎంత అనే ప్రశ్నలు వెలువడుతున్నాయ. అతీక్, అతని సోదరుడిని చంపడానికి వాడిన ఓ తుపాకీని టర్కీ నుంచి తీసుకొచ్చారనీ, భారత్ లో ఆ తుపాకీని నిషేధించినట్టు పోలీసులు తెలిపారు.
ఈ తుపాకులను చట్టవిరుద్దంగా దేశంలోకి ఎగమతి చేస్తున్నారనీ, ఈ తుపాకీ ధర సుమారు రూ. 6 నుంచి రూ. 7లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఈ తుపాకీతో కేవలం 40 సెకన్లలో 18 రౌండ్ల కాల్పులు జరపవచ్చనీ, ఈ పిస్టల్స్‌లో ఆటోమేటిక్ ఫైరింగ్ పిన్ బ్లాక్ కూడా ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. ఈ తుపాకీని జిగానా ఫిస్టల్ అని పిలుస్తారట. ఈ పిస్టల్‌ను మలేషియా సైన్యం, అజర్‌బైజాన్ సాయుధ దళాలు , ఫిలిప్పీన్ జాతీయ పోలీసులు ఉపయోగిస్తున్నారు. జాఫర్, జాఫర్-కె, జాఫర్-పి , ఇనామ్ వేరియంట్‌లను అజర్‌బైజాన్ సాయుధ దళాలు , పోలీసు విభాగాలు ఉపయోగిస్తున్నాయి.
ఆశ్చర్యకరం విషయమేంటంటే.. మే 2021లో చిత్రకూట్ జైలులో జరిగిన షూటౌట్‌లో కూడా ఇదే పిస్టల్‌ను ఉపయోగించారు. అన్షు దీక్షిత్ అనే షూటర్ ఈ తుపాకీ ఉపయోగించే ముకిమ్ కాలా,మెరాజుద్దీన్‌లను చంపాడు. పంజాబ్‌లో యువ పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలాను ఇదే రీతిలో కాల్చి చంపినప్పుడు కూడా ఈ పిస్టల్స్ వెలుగులోకి వచ్చాయి. సిద్ధూ ముసేవాలా కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.
అతిక్‌పై కాల్పులు జరిపిన ఈ ముగ్గురు యువకులు యూపీలోని బండా, హమీర్‌పూర్, కస్గంజ్‌లకు చెందినవారు. వారిని లవ్లేష్ (బండా), సన్నీ (హమీర్‌పూర్), అరుణ్ (కస్గంజ్)గా గుర్తించారు. వీరు చిన్న చిన్న నేరాలకు పాల్పడే యువకులు. అయితే.. వారిని ఈ ఆయుధాలు వచ్చాయనేది పెద్ద ప్రశ్న.. గతంలో సరిహద్దు ఆవల నుంచి పాకిస్తాన్ సరఫరా చేస్తుందనీ, పాకిస్తానీ డ్రోన్ల ద్వారా భారత సరిహద్దులో పడవేస్తాయని ఆరోపణలున్నాయి.
