తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం మెరీనా స్క్వేర్ వద్ద ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీవ దేహాన్ని ప్రజలు, అభిమానులు సందర్శించేందుకు గాను రాజాజీ హాల్ లో ఉంచారు.

అయితే ఉదయం నుంచి సంయమనంగా ఉన్న అభిమానులు.. మధ్యాహ్నం కాస్త అదుపుతప్పారు. కరుణకు నివాళులర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు రావడంతో సామాన్యులకు అవకాశం రాలేదు. దీంతో కరుణను దగ్గరగా చూడాలని అభిమానులు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు బారికేడ్లు దాటుకుని కరుణ పార్థివదేహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సుమారు 26 మంది వరకు గాయపడ్డారు. రాజాజీ హాల్‌ సమీపంలో ఉన్న ప్రజలను పోలీసులు చెదరగొట్టారు. హాల్‌ చుట్టూ భారీగా మోహరించారు. సమీపంలోకి ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కరుణ పార్థివదేహం ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా తలుపులు వేసేశారు.