అస్సాంలోని జోర్హట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. కేవలం ఆరు రోజుల్లో 15మంది పసికందులు కన్నుమూశారు. పుట్టిపుట్టగానే.. కనీసం లోకం కూడా చూడకుండానే 15మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా  అస్సాం వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.

కాగా.. ఈ పసికందుల మృతి పై హాస్పిటల్ సిబ్బంది చెబుతున్న మాటలు వేరేవిధంగా ఉన్నాయి. తమ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. చనిపోయిన పసికందులు.. పుట్టేటప్పడు  తక్కువ బరువుతో పుట్టారని.. అందుకే ఇలా జరిగిందని వారు చెబుతున్నారు. అప్పటికీ వారిని స్పెషల్ కేర్ యూనిట్ లో ఉంచామని.. అయినప్పటికిీ ఇలా జరిగిందని చెబుతున్నారు.

తమ హాస్పిటల్ చాల పెద్దదని.. దీంతో.. హాస్పిటల్ కి వచ్చే రోగులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చావులు కూడా పెద్ద సంఖ్యలో కనపడుతున్నాయని సిబ్బంది అభిప్రాయపడ్డారు. తమ హాస్పిటల్ సిబ్బందిలో ఆరుగురిని ప్రత్యేకంగా ఒక కమిటీగా ఏర్పాటు చేశామని.. చిన్నారుల మృతికి గల పూర్తి కారణాలు బయటపెడతామని హాస్పిటల్ సూపరెండెంట్ సౌరవ్ తెలిపారు.