మిలిటెంట్లతో పోరాడి 32 ఏళ్ల క్రితం మరణం.. అసోం పోలీసును అమరవీరుడిగా ప్రకటించిన ప్రభుత్వం
అసోంలో మిలిటెంట్లతో పోరాడి 32 ఏళ్ల క్రితం అసోం పోలీసు శాఖలో ఎస్ఐగా పని చేసిన మోయినుల్ హక్ మరణించారు. తాజాగా, ప్రభుత్వం ఆయనను అమరవీరుడిగా ప్రకటించింది.
న్యూఢిల్లీ: అసోంలోని బార్పెటా నగరానికి చెందిన పోలీసు అధికారి మోయినుల్ హక్ తిరుగుబాటుదారులతో పోరాడుతూ 32 ఏళ్ల క్రితం అసువులుబాశారు. ఇప్పుడు తాజాగా అసోం ప్రభుత్వం ఆయనను అమరవీరుడిగా ప్రకటించింది. దీంతో ఆయన స్వగ్రామం బార్పెటా జిల్లాలోని గరెమారిలో సంతోషాలు మిన్నంటాయి.
అసోం పోలీసు శాఖలో ఎస్ఐగా పని చేసిన మోయినుల్ హక్ డ్యూటీలో ఉండగా కొందరు తిరుగుబాటుదారులతో పోరాడారు. బార్పెటా జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఉండగా 1991 జనవరి 21వ తేదీన తిరుగుబాటుదారులతో పోరాడుతూ మరణించారు. ఆయన ప్రాణ త్యాగానికి నివాళిగా 102వ కుమల్లిపార గావ్ పంచాయత్ ఓ శిలాఫలకాన్ని స్థానిక కాలేజీలో ఆవిష్కరించింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
గరెమారి గ్రామంలో మోయినుల్ హక్ 1948లో జన్మించారు. సామాజిక అవగాహన గల నైపుణ్య, సాహసోపేత పోలీసు అధికారి. గరెమారిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బాబర్ అలీ మొల్లా మద్రసాా, ఇతర సంస్థలను ఆయన స్థాపించారు.
ప్రభుత్వం ఆయనను 32 సంవత్సరాల తర్వాతైనా అమరవీరుడిగా ప్రకటించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ‘మోయినుల్ హక్‌ను అమరవీరుడిగా ప్రకటించడం సంతోషంగా ఉన్నది. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు ఆయన.’ అని ప్రభుత్వ గ్రామ చీఫ్ బుల్బుల్ హుస్సేన్ తెలిపారు.
మోయినుల్ హక్ శిలాఫలకాన్ని నెలకొల్పడం సంతోషంగా ఉన్నదని కుముల్లిపార గావ్ పంచాయతీ అధ్యక్షుడు రుమా పర్బిన్ సుల్తానా ఖానమ్ తెలిపారు.
మోయినుల్ హక్ కొడుకు ఇస్మాయిల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘మా నాన్న అమరవీరుడు మెయినుల్ హక్ 1991 జనవరి 21వ తేదీన మిలిటెంట్ల దాడిలో ప్రాణాలు అర్పించారు. అసోం పోలీసుల విధుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 32 ఏళ్ల తర్వాత చాలా ఆలస్యం అయినా ప్రభుత్వం ఆయనను అమరవీరుడని ప్రకటించింది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి అమరుడికి నా నివాళులు’ అని అన్నారు.
-- సాయిజు రెహ్మాన్