Asianet News TeluguAsianet News Telugu

Assam Floods: అసోంలో వరద బీభత్సం.. 20 జిల్లాల్లో దాదాపు 1.97 లక్షల మంది ప్ర‌భావితం

Assam Floods: అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద బీభత్సంగా మారింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 1.97 లక్షల మంది ప్రజలు ఈ వ‌ర‌ద‌ల‌కు ప్రభావితమయ్యారు. అదే స‌మ‌యంలో అస్సాంలో ఇద్దరు, అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు మరణించారు. 
 

Assam Floods landslides affect 1.97 lakh people across 20 districts
Author
Hyderabad, First Published May 17, 2022, 6:13 AM IST

Assam Floods: దేశంలోని ప‌లు రాష్ట్రాలు భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. అసోం మాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వ‌ల్ల వరదల్లో చిక్కి చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఇటీవల కురిసిన‌ భారీ వర్షాలకు అసోంలోని ఆరు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప‌లు చోట్ల వరదలు పోటేత్తున్నాయి. కొండ చరియలు విరిగిప‌డుతున్నాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 1.97 లక్షల మంది ప్రజలు ఈ వ‌ర‌ద‌ల‌కు ప్రభావితమయ్యారు. అదే స‌మ‌యంలో అస్సాంలో ఇద్దరు, అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు మరణించారు. 

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఒక్క క్యాచర్ జిల్లాలోనే 51,357 మంది వ‌ర‌దల‌కు ప్రభావితమయ్యారు. ఈ వరదల కారణంగా 46 రెవెన్యూ డివిజన్లలోని 652 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 16,645.61 హెక్టార్ల పంట నీట మునిగిపోయింది.

జోర్హాట్ జిల్లాలోని నిమ్తిఘాట్, నాగావ్ జిల్లాలోని కంపూర్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. నాగావ్ జిల్లాలోని కంపూర్ ప్రాంతంలో వరదల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. న్యూ కుంజంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయి, నమ్‌జురాంగ్, దక్షిణ్ బగేటార్, మహాదేవ్ తిలా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడ్డాయి.

అదే సమయంలో.. భారీ కొండచరియలు విరిగిపడటం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోయాయి.  అసోం డిమా హసావో జిల్లాలోని ఎన్‌ఎఫ్‌ఆర్‌లోని లుమ్‌డింగ్-బాదర్‌పూర్ హిల్ స్టెష‌న్ లో రెండు రోజులుగా నిలిచిపోయిన రెండు రైళ్లలోని 2800 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఈ అప‌రేష‌న్ పూర్తయిన‌ట్టు ఎయిర్ ఫోర్స్, ఇతర ఏజెన్సీలు.. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. 

శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడటంతో పలువురు ప్రయాణికులను వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి చెప్పారు.  ఎన్‌ఎఫ్‌ఆర్ ప్రతినిధి గౌహతిలో మాట్లాడుతూ.. శనివారం నుండి సెక్షన్‌లోని 18 రైళ్లు రద్దు చేసిన‌ట్టు తెలిపారు. వ‌ర‌ద‌ ప్రభావిత ప్రాంతంలో మరో 10 కి పైగా రైళ్లు కొంతకాలం వాయిదా వేసిన‌ట్టు తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.

డిమా హసావో జిల్లా ప్రధాన కార్యాలయం హఫ్లాంగ్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం.. న్యూ హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ చాలా వరకు నీటిలో మునిగిపోయింది. దీంతో ట్రాక్‌లు దెబ్బ‌తిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో జిల్లాలో రోడ్డు కనెక్టివిటీ కూడా తెగిపోయింది.

అదే సమయంలో, ప్రభుత్వం భారత సైన్యం, పారామిలిటరీ బలగాలు, అగ్నిమాపక,  అత్యవసర సేవలు, SDRF, పౌర పరిపాలన , శిక్షణ పొందిన వాలంటీర్లల‌ను సహాయక చర్యల కోసం మోహరించింది ప్ర‌భుత్వం. కాచార్ జిల్లా యంత్రాంగం, అస్సాం రైఫిల్స్ జాయింట్ వెంచర్ బరాక్లా ప్రాంతంలో వరద బాధితులను రక్షించి సహాయ శిబిరాలకు త‌ర‌లించారు.

Follow Us:
Download App:
  • android
  • ios