శ్రద్ధా వాకర్ హత్య కేసుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంకెంత కాలం ఇలాంటి అఫ్తాబ్‌లు పుట్టుకొస్తారని ప్రశ్నించారు. శక్తివంతమైన ప్రభుత్వాలు లేకుంటే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో లవ్ జిహాద్ కోణం వుందన్న ఆయన.. శ్రద్ధాను ఢిల్లీకి తీసుకెళ్లిన నిందితుడు అఫ్తాబ్ ఆమెను 35 ముక్కలు చేశాడని ఆరోపించారు. శ్రద్ధా మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో వుంచి మరో మహిళతో అదే ఫ్లాట్‌లో డేటింగ్ చేశాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇంకెంత కాలం ఇలాంటి అఫ్తాబ్‌లు పుట్టుకొస్తారని హిమంత బిశ్వశర్మ ప్రశ్నించారు. శక్తివంతమైన ప్రభుత్వాలు లేకుంటే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోందన్న ఆయన.. దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. దీని వల్ల ముస్లిం పురుషులు ఒకటికి మించి వివాహాలు చేసుకోవడం కుదరదని హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. అలాగే ముస్లిం మహిళలను ఆటబొమ్మలుగా చూడటం కూడా కుదరదని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు శ్రద్ధ ఘటనపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా వాకర్ హత్యకు లివ్ ఇన్ రిలేషన్ షిపే కారణమని చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రాకూడదు అని కేంద్ర మంత్రి కోరారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేరాలకు దారితీస్తోందని పేర్కొంటూ.. తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి భాగస్వాములతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను కౌశల్ కిషోర్ తప్పుపట్టారు.
‘అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఎందుకు జీవిస్తున్నారు? ఇలాంటి రిలేషన్ షిప్ కు తల్లిదండ్రులు బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి ఇష్టపడకపోతే కోర్టు మ్యారేజ్ చేసుకొని కలిసి జీవించాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రాకూడదు. శ్రద్ధా వాకర్ హత్య కేసు నుంచి నేర్చుకోవాలి. తమ తల్లిదండ్రుల ఆమోదంతో ఎవరితోనైనా ఉండాలి’ అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వ్యాఖ్యానించారు. దీనిమీద శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఒక ట్వీట్ లో తీవ్రంగా స్పందించారు. చౌకబారు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిని తొలగించాలని ప్రియాంక డిమాండ్ చేశారు.
ALso REad:చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రావద్దు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా, నవంబర్ 16న పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యపై స్పందించారు. అమ్మాయిలు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా సరే.. వారు తమ కూతుళ్ళపై నిఘా ఉంచాలని అన్నారు. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఆలస్యంగా ఆరా తీశారని అన్నారు. శ్రద్ధ తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అన్నారు. ఈ ఘటనకు ఇరుగు పొరుగు వారు, ఆమె నివసించే ఫ్లాట్ యజమాని కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
దీనివల్ల మొత్తం కుటుంబం నష్టపోయిందని ఆమె అన్నారు. ఇది సమాజ వైఫల్యం అని.. స్నేహితులు కూడా విఫలం అయ్యారని కిరణ్ బేడీ అన్నారు. అమ్మాయిలకు భరోసా ఇవ్వడంలో కుటుంబం పాత్ర ముఖ్యమని తెలిపారు. డేటింగ్ యాప్ లో ఆఫ్థాబ్ ఎంతగా నిమగ్నమయి వున్నాడో అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఓ రకంగా నేరానికి దారితీసిన పరిస్థితులను శ్రద్ధా చూసిందని ఆమె చెప్పారు. అమ్మాయిలు ధైర్యంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని.. జీవితంలో ఛాలెంజెస్, రియాలిటీల గురించి తల్లిదండ్రులు చెప్పాలని అన్నారు.
