ట్విట్టర్ బయో నుంచి ‘india’ తొలగించిన అసోం సీఎం.. ‘మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారు’
విపక్షాలు తమ కూటమికి షార్ట్ ఫామ్‌గా ఇండియా అని నామకరణం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసోం సీఎం హిమంత శర్మ చేసిన ట్వీట్ కలకలం రేపింది. తమ పూర్వీకులు ఇండియా కోసం కాదు.. భారత్ కోసం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత తన ట్విట్టర్ బయోలో ఇండియా స్థానంలో భారత్ అని చేర్చారు.

న్యూఢిల్లీ: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రతిపక్షాల ఐక్య కూటమిని పరోక్షంగా పేర్కొంటూ మన పూర్వీకులు ఇండియా కోసం కాదు.. భారత్ కోసం పోరాడారని పేర్కొన్నారు. ఈ రోజు బెంగళూరులో విపక్ష పార్టీలు తమ కూటమికి కొత్త పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్‌గా కూటమి పేరును ప్రకటిస్తూ.. ఈ పదాల ముందు అక్షరాలను జోడించి షార్ట్ ఫామ్‌గా ఇండియా అని పేర్కొన్నాయి.
తాజాగా, ఇండియా అనే పేరు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మనకు అవసరం లేనిది అని చెప్పే ప్రయత్నం చేశారు. మన సాంస్కృతిక సంఘర్షణ మొత్తం ఇండియా, భారత్ కేంద్రంగానే జరిగిందని ట్వీట్ చేశారు. బ్రిటీషర్లు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. ఈ వలసవాద వారసత్వం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారు. మనం భారత్ కోసం ఆ పోరాటాన్ని కొనసాగించాలి. భారత్ కోసం బీజేపీ అంటూ ట్వీట్ ముగించారు.
ఈ ట్వీట్ చేయగానే.. సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇండియా అనే పేరును ఆయన అవసరం లేదన్నట్టుగా చిత్రించడం, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి ట్వీట్ చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. ప్రముఖ విమర్శకుడు ఆకార్ పటేల్ వెంటనే రియాక్ట్ అవుతూ రాజ్యాంగ పీఠికను పోస్టు చేశారు. రాజ్యాంగ పీఠికలో తొలి వాక్యమే వీ ద పీపుల్ ఆల్ ఇండియా అని ఉంటుందన్న సంగతి తెలిసిందే.
Also Read: కుల గణన జరుపుతాం.. మైనార్టీలు, కశ్మీరీ పండితులపై నేరాలకు అడ్డుకట్ట వేస్తాం: ప్రతిపక్షాల ఐక్య ప్రకటన
అదీగాక, చాలా మంది నెటిజన్లు.. ఇది వరకు బీజేపీ తెచ్చిన కార్యక్రమాలనూ ఏకరువు పెట్టారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా.. ఇప్పుడు నో ఇండియానా? అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు. ఇంకొందరు మన సివిలైజేషనే ఇండస్ రివర్ దగ్గర మొదలైందని, దాని పేరు మీదుగానే ఇండియా పేరు వచ్చిందని ఒంకొకరు ట్వీట్ చేశారు.
మరొకరు ఇంకో అడుగు ముందుకేసి ముందు సీఎం హిమంత, పీఎం మోడీ ట్విట్టర్ బయోలోనైనా ఇండియా అనే పదాన్ని మార్చుకుంటే మంచిది అంటూ వ్యంగ్యం పలికారు
ఆ తర్వాత కొద్ది సేపటికే హిమంత శర్మ తన ట్విట్టర్ బయోలో నిజంగానే ఇండియా అనే పదాన్ని మార్చారు. ట్విట్టర్ బయోలో హిమంత బిశ్వ శర్మ.. చీఫ్ మినిస్టర్ ఆఫ్ అసోం, ఇండియా అని ఉండగా.. అక్కడ ఇండియా స్థానంలో భారత్ అని చేర్చడం గమనార్హం.