కేరళలో ఏషియానెట్ న్యూస్ కొచ్చి కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అర్జున్‌బాబు పోలీసులకు లొంగిపోయారు.
కేరళలో ఏషియానెట్ న్యూస్ కొచ్చి కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అర్జున్‌బాబు పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఏషియానెట్ న్యూస్ కొచ్చి కార్యాలయంపై దాడికి అర్జున్ బాబు నాయకత్వం వహించాడు. ఇక, కేరళలోని కొచ్చిలోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రంలో అధికార సీపీఐ(ఎం)కు విద్యార్థి విభాగం అయిన ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు దాడి చేశారు. డ్రగ్స్ మాఫియాపై తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఆరోపిస్తూ దూషణలకు దిగారు. అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులను కూడా బెదిరించారు.
ఏషియానెట్ న్యూస్ కార్యాలయం ముందు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అసభ్యకర బ్యానర్ కట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఏషియానెట్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ అభిలాష్ జీ నాయర్ ఫిర్యాదు మేరకు పలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులపై 143 (చట్టవిరుద్ధమైన సమావేశం), 147 (అల్లర్లు) మరియు 149 సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి కార్యాలయంలోకి చొరబడిన సీసీటీవీ ఫుటేజీని ఫిర్యాదుతో పాటు కూడా ఏషియానెట్ న్యూస్ పోలీసులకు సాక్ష్యంగా అందించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అర్జున్‌బాబు ఆధ్వర్యంలో దాదాపు 30 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఏషియానెట్ న్యూస్ కార్యాలయ ఉద్యోగులను బెదిరించి రాత్రి కార్యాలయంలోకి చొరబడి పనులకు ఆటంకం కలిగించినట్లు గుర్తించారు.
ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ దాడి ఘటనను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఎస్‌ఎఫ్‌ఐ దాడిని ఖండిస్తూ కేరళలోని కొచ్చి, త్రిసూర్, కన్నూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. ఈ ఘటన చోటుచేసుకున్న కొన్ని గంటలకే కోజికోడ్‌లోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఇక, ఏషియానెట్ న్యూస్ కొచ్చి కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ దాడి ఘటనను ప్రతిపక్షాలు కేరళ శాసనసభలో లేవనెత్తుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో నిందితుడు అర్జున్ బాబు ఇప్పుడు పోలీసులకు లొంగిపోయాడు.
