కేరళ ఏషియానెట్ న్యూస్‌పై ఎస్‌ఎఫ్‌ఐ దాడి, పోలీసుల సోదాలను న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్‌బీడీఏ) తీవ్రంగా ఖండించింది.

కేరళ ఏషియానెట్ న్యూస్‌పై ఎస్‌ఎఫ్‌ఐ దాడి, పోలీసుల సోదాలను న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్‌బీడీఏ) తీవ్రంగా ఖండించింది. కేరళ కొచ్చిలోని మలయాళ వార్తా ఛానెల్ ఏషియానెట్ కార్యాలయంపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ) కార్యకర్తలు చేసిన దాడిని, తర్వాత కోజికోడ్‌లోని ఏషియానెట్‌ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపింది. కేరళలో ఒక యువతిపై డ్రగ్స్, లైంగిక వేధింపుల సమస్యపై ఏషియానెట్ న్యూస్‌ ఛానెల్ రిపోర్టింగ్ చేసిన నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల దాడి, ఆ తర్వాత పోలీసులు సోదాలు చేయడం జరిగిందని.. అయితే ఈ చర్యలు ఆమోదయోగ్యం కావని ఎన్‌బీడీఏ పేర్కొంది. ఇలాంటి చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం మీడియా వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష భంగం కలిగిస్తాయని తెలిపింది. 

ఏషియానెట్ న్యూస్ ప్రాంగణాలపై దాడి చేయడం, సోదాలు జరపడం వంటి ఘటనలకు సమర్థించలేమని ఎన్‌బీడీఏ నిస్సందేహంగా తెలియజేసింది. ఎందుకంటే ఇటువంటి దాడులు, సోదాలు శోధనలు మీడియాను నిరోధించే స్పష్టమైన ప్రయత్నం అని పేర్కొంది. ‘‘మీడియా ప్రజాస్వామ్యం నాల్గవ స్తంభంగా పరిగణించబడుతుంది. ప్రజలకు ప్రజా ప్రయోజన వార్తలను ప్రసారం చేయడం ప్రజాస్వామ్య పనితీరుకు అనివార్యమైనది. అందువల్ల మీడియా తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకునే ఏ చర్య అయినా రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని’’ ఎన్‌బీడీఏ పునరుద్ఘాటించింది.

ఏ వ్యక్తులైనా, అధికారులైన చట్ట పరిధికి అతీతం కాదనే సందేశాన్ని కూడా తెలియజేసింది. ఏషియానెట్ న్యూస్ కార్యాలయ ఆవరణపై దాడి చేసిన వ్యక్తులపై, సోదాలు నిర్వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రిని ఎన్‌బీడీఏ కోరింది.

ఇక, కేరళలోని కొచ్చిలోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులను కూడా బెదిరించారు. ఈ ఘటనను ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఎస్‌ఎఫ్‌ఐ దాడిని ఖండిస్తూ కేరళలోని కొచ్చి, త్రిసూర్, కన్నూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. ఈ ఘటన చోటుచేసుకున్న కొన్ని గంటలకే కోజికోడ్‌లోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 

సీపీఐ(ఎం) మద్దతు ఉన్న ఎమ్మెల్యే పీవీ అన్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆదివారం ఉదయం ఏషియానెట్ న్యూస్ కోజికోడ్ కార్యాలయంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి నేపథ్యంలోనే పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.