చుట్టూ జరుగుతున్న విషయాలను ప్రపంచానికి అందించడంతో పాటు అన్యాయాలపై ఎత్తిచూపే జర్నలిస్టులు.. విపత్కర సమయాల్లో ఆపద్భాందవుడి అవతారం సైతం ఎత్తుతారు. ఇందుకు సంబంధించి ఎన్నో ఉదంతాలు. తాజాగా లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ జరగడంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏషియానెట్ న్యూస్‌కు చెందిన రిపోర్టర్ కాపాడాడు.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం కేరళ రాజధాని తిరువనంతపురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వజైలా జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. సిపిఐఎం రాష్ట్ర రహస్య సమావేశం గురించి ఏషియానెట్ న్యూస్ తిరువనంతపురం రీజనల్ ఎడిటర్ అజయ్‌గోష్ అనే రిపోర్టర్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆ సమయంలో చిరు జల్లులు పడుతున్నాయి. సరిగ్గా అజయ్ రిపోర్టింగ్ చేస్తున్న వెనుక వైపు పెద్ద శబ్ధంతో రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంపై ఆయన మాటల్లోనే.. ‘‘ నేను రిపోర్టింగ్ చేస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం.. మోటారు సైకిలిస్ట్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితుడికి స్వల్పగాయాలయ్యాయి. అయితే అతనికి మరోకరి సాయం కావాలి. నా రెండు దశాబ్దాల జర్నలిస్ట్ కెరీర్‌లో అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. మన కళ్ల ముందు ప్రమాదం జరిగితే సహాయం చేయాలి.. అదొక్కటే నేను ఆలోచించాను’’ . 

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కూడా గాయపడిన వారిని ఆటోలో ఎక్కించేందుకు సాయం చేశాడు. ఆ తర్వాత తోటి ప్రయాణికులు సైతం సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. కాగా బాధితుడిని ఆసుపత్రికి పంపించామని కాకుండా అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ఫోన్ చేసిన అజయ్ ఘోష్ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయడం విశేషం.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితులకు సహాయం చేయడానికి అజయ్ గోష్ రిపోర్టింగ్‌ను పక్కనబెట్టి మరి రెప్పపాటులో వెనక్కి తిరగడాన్ని ఆ వీడియో చూడవచ్చు. 

 

"