ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వాన్ని గ్యాంగ్‌స్టర్ కాల్చివేతలో పాత్ర ఉందని ఆరోపించారు

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్ పై గుర్తు తెలియని యువకులు కాల్చి చంపారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరును ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. యూపీలో చట్టబద్ధత లేదని, ఇలాంటి ఘటనల వల్ల ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం తగ్గుతుందని విమర్శించారు. 

అసదుద్దీన్ ఒవైసీ ఇంకా మాట్లాడుతూ.. పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా కాల్చలేదని, హంతకులు అక్కడికి ఎలా చేరుకున్నారు? పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు ? అని ఆయన ప్రశ్నలు సంధించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలి. ఈ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఆ బృందంలో ఉత్తరప్రదేశ్ అధికారులు ఉండకూడదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని నడపడం లేదని.. తుపాకీ పాలనతో ప్రభుత్వం నడుస్తోందని ఒవైసీ పేర్కొన్నారు.

'లా అండ్ ఆర్డర్ వైఫల్యం'

అతిక్, అతని సోదరుడు ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారని, వారికి సంకెళ్లు వేశారని పేర్కొన్నారు. వారి హత్యను "కోల్డ్ బ్లడెడ్" హత్య అని AIMIM చీఫ్ అన్నారు. "వారికి (హంతకులకు) ఆ ఆయుధాలు ఎలా లభించాయి?... వారిని చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేస్తున్నారు? ఉగ్రవాదులు కాకపోతే మీరు వారిని ఏమంటారు? మీరు వారిని దేశభక్తులు అంటారా?" అని ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తులను చంపడం యోగి లా అండ్ ఆర్డర్ వైఫల్యమని విమర్శించారు. ఎన్‌కౌంటర్‌ను సెలబ్రేట్ చేసుకున్న వారు కూడా ఈ హత్యకు పాల్పడ్డారనీ అన్నారు. మాఫియా నుంచి రాజకీయ నాయకుడు మారిన అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్‌లో వైద్య పరీక్ష కోసం తీసుకువెళుతుండగా కాల్చి చంపబడ్డారు.

హంతకుల అరెస్ట్ 

అతిక్,అష్రఫ్ అహ్మద్ హత్య తర్వాత దాడి చేసిన వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు.పోలీసుల సమక్షంలో మీడియాతో మాట్లాడుతున్నఅతిక్, అష్రఫ్‌లపై కాల్పులు జరిగాయి. చాలా సమీపం నుంచి పలు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో కస్టడీలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ అతిక్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.