గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ సవరణలు చేసిన భారత్‌పై జీ7 దేశాలు విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తమను ఆది నుంచి శత్రువులుగానే చూస్తున్న చైనా మాత్రం అనూహ్యంగా భారత్‌కు అండగా నిలిచింది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలను విమర్శించడం సరికాదని స్పష్టంగా పేర్కొంది.
న్యూఢిల్లీ: భారత్‌తో పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా తరుచూ కవ్వింపులకు దిగుతున్నాయి. పాకిస్తాన్‌తోపాటు చైనా నుంచి కూడా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు ఎప్పుడూ నెలకొనే ఉంటున్నాయి. చైనాతోనూ భారత్ అన్ని వ్యవహారాల్లో ఢీ అంటే ఢీ అన్నట్టుగానే ఉంటాయి. కానీ, డ్రాగన్ కంట్రీ తాజాగా, జర్మనీ సహా పలు దేశాలు విమర్శలు చేసిన తరుణంలో భారత్‌కు అనూహ్యంగా మద్దతు ఇచ్చింది. శక్తిమంతమైన జీ7 దేశాలకు కౌంటర్ ఇచ్చింది. ఆ దేశాలపై విమర్శలు చేస్తూ భారత్ పక్షాన నిలబడింది. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను తప్పుబడితే అంతర్జాతీయ ఆహార సంక్షోభ సమస్య పరిష్కృతం కాదని చైనా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
గోధుమల ఎగుమతిని భారత్ గతవారం నిషేధించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అప్పుడు ప్రకటించింది. భారత్‌లో ఆహార సరుకుల ధరలను నియంత్రణలో ఉంచడానికి, ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరో ప్రకటనలో పేర్కొంది. అయితే, అంతకు ముందే ఇతర దేశాల ప్రైవేటు ప్లేయర్స్‌తో తమతో చేసుకున్న ఒప్పందాల మేరకు ఎగుమతులు ఉంటాయని వివరించింది. అప్పటికే కుదిరిన అన్ని కాంట్రాక్టులను గౌరవిస్తామని పేర్కొంది.
జీ7 దేశాలు మాత్రం భారత్ గోధుమల ఎగుమతిని నిషేధించడాన్ని జీర్ణించుకోలేవు. జీ7 దేశాల వ్యవసాయ శాఖమంత్రుల జర్మనీలో సమావేశం అయ్యాయి. జర్మనీ వ్యవసాయ శాఖ మంత్రి భారత నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఇప్పుడు జీ7 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు భారత్ గోధుమల ఎగుమతిని నిషేధించొద్దని కోరుతున్నాయని, కానీ అప్పుడు ఆ దేశాలు స్వయంగా ఫుడ్ మార్కెట్ సప్లైని స్థిరీకరించడానికి ఎందుకు ఎగుమతులు పెంచడం లేదని ప్రశ్నించింది. ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు భారత్ కావచ్చు.. కానీ, ఎగుమతుల్లో మాత్రం భారత్ వాటా స్వల్పమేనని వివరించింది. కానీ, అభివృద్ధి చెందిన దేశాలు అంటే యూఎస్, కెనడా, ఈయూ, ఆస్ట్రేలియాలు ప్రధాన గోధుమ ఎగుమతి దేశాలు అని తెలిపింది. పశ్చిమ దేశాలపై చైనా తన దాడిని మరింత వాడిగా చేస్తూ.. అంతర్జాతీయంగా ఆహార సంక్షోభం ఏర్పడే ముప్పు ఉన్న నేపథ్యంలో పశ్చిమ దేశాలు వాటి ఆహార ఎగుమతులు నిలిపేశాయని, అలాంటి దేశాలు భారత్‌ను విమర్శించే హక్కును కోల్పోయినట్టేని విమర్శించింది. అంతేకాదు, అంతర్జాతీయ ఆహార సంక్షోభాన్ని ఓడించడానికి ఈ జీ7 దేశాలు ముందుకు వస్తే తాము స్వాగతిస్తామని తెలిపింది. అంతేగానీ, భారత్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలను విమర్శించడం సరికాదని వివరించింది.
