ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో నిర్మాణాలు, కూల్చివేతల పనులపై నిషేధం విధించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో దేశ భద్రత, రక్షణ, రైల్వే, మెట్రో, ఇతర అత్యవసర ప్రాజెక్టులు మినహా మిగతా అన్నింటిపై నిషేధం వర్తించనుంది. 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి వాయు ప్రమాణాలు పడిపోయాయి. వాయు కాలుష్యం తీవ్రతరమైంది. దీంతో కేంద్ర ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ శనివారం కీలక ఆదేశాలు వెలువరించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించాలని ఆదేశించింది. అయితే, అత్యవసర ప్రాజెక్టులు అంటే.. దేశ భద్రత, రక్షణ, రైల్వే, మెట్రో రైలు మున్నగు వాటిపై ఈ నిషేధం వర్తించబోదని వివరించింది. కాగా, మైనింగ్ కార్యకలాపాలు మాత్రం నిలిపివేయబడతాయి.

ఢిల్లీ ప్రభుత్వం కావాలనుకుంటే బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ ఫోర్ వీలర్ల కదలికలపై ఆంక్షలు విధించవచ్చని సూచనలు చేసింది. ఈ నిషేధం నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ఏరియాల్లో భవన నిర్మాణ పనులపై ప్రతికూల ప్రభావం వేయనుంది.

ఢిల్లీ 24 గంటల సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 397 వద్ద ఉన్నది. జనవరి నుంచే ఇదే తీవ్రమైనది. గురువారం ఈ ఇండెక్స్ 354 వద్ద, బుధవారం 271 వద్ద, మంగళవారం 302 వద్ద, సోమవారం (దీపావళి) 312 వద్ద ఉంది.

Also Read: వాయు కాలుష్యంతో ఏటా ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు?

వాతావరణ పరిస్థితులూ ప్రతికూలంగా మారడం, పంట వ్యర్థాల దహనం ఒక్కసారిగా పెరిగిపోయిన నేపథ్యంలో శనివారం సాయంత్రం కమిషన్‌కు చెందిన ఒక సబ్ కమిటీ సమావేశమైంది. పరిస్థితులను అంచనా వేసిన తర్వాత గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 కింద నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించాలనే నిర్ణయాన్ని ఈ సబ్ కమిటీ తీసుకుంది. 

స్టేజ్ 3 కింద ఎన్‌సీఆర్ ఏరియాలో అత్యవసర ప్రాజెక్టులు, కాలుష్య రహిత పనులకు తప్పితే మిగతా వాటిపై ఈ బ్యాన్ విధించింది. భూ తవ్వకాలు, బోరింగ్, డ్రిల్లింగ్, వెల్డింగ్ ఆపరేషన్లు, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ లోడింగ్, అన్‌లోడింగ్, ఫ్లై యాష్ సరఫరాలు సహా పలు అంశాలపై నిషేధం అమలు అవుతుంది. మురికి నీటి పైపులు వేయడం, డ్రైనేజీ వర్క్, వాటర్ లైన్లు, ఎలక్ట్రిక్ కేబుల్, టైల్స్, స్టోన్స్ పనులు సహా ఇతర ఫ్లోరింగ్ పనులు, గ్రైండింగ్ పనులు, రోడ్డు నిర్మాణాలు, రిపేర్ పనులు, సైడ్ వాక్స్, పాథ్‌వేలు సహా అన్నింటిపై నిషేధం ఉంటుంది. ఇటుక బట్టీలు, హాట్ మిక్స్ ప్లాంట్లు, స్టోన్ క్రషర్లు (క్లీన్ ఫ్యూయల్స్ వాడనివి) సహా ఇతరత్రాలపై నిషేధం ఉండనుంది.