ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన కేజ్రీవాల్.. : ఎస్ఈసీకి బీజేపీ ఫిర్యాదు
New Delhi: ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. ఈ క్రమంలోనే ఎన్నికల అధికారి ఎస్ఈసీకి లేఖ రాసింది.

Delhi MCD elections: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ను ఉల్లంఘించారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఢిల్లీ యూనిట్ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎంసీడీ ఎన్నికలకు కేవలం రెండు రోజులు మిగిలి ఉండగా, బీజేపీ కేజ్రీవాల్ పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
వార్తాసంస్థ పీటీఐ నివేదికల ప్రకారం.. కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హాజరైన 'దిల్లీ కి యోగశాల: యోగ్ ప్రాషికోన్ కో సమ్మాన్ రాశి కా విత్రన్' అనే కార్యక్రమంతో ఎన్నికల కోడ్ ను ఉల్లంగించారని బీజేపీ ఆరోపించింది. ఫిర్యాదు తర్వాత, ఎన్నికల ప్యానెల్ న్యూ ఢిల్లీ జిల్లా ఎన్నికల అధికారి (DEO)కి లేఖ రాసింది. ఈవెంట్‌ను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. "ఈ విషయంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి అటువంటి అనుమతి పొందలేదని తెలియజేయడానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి ఏదైనా అనుమతి పొందినట్లయితే.. జిల్లా స్థాయి నుండి ఏదైనా అనుమతి మంజూరు చేయబడి ఉంటే, అదే తనిఖీ చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ MCC ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలి" అని లేఖలో పేర్కొన్నారు. అయితే, అన్ని విషయాలను ధృవీకరించిన తర్వాత, తక్షణ చర్యలు తీసుకోవాలనీ, శుక్రవారం నాటికి చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని లేఖలో పేర్కొన్నారు.
MCC ఉల్లంఘన ఉన్నట్లయితే, అవసరమైన "చట్టపరమైన చర్యలు" తీసుకోవాలని కోరారు. తకుముందు రోజు, బీజేపీ ఢిల్లీ యూనిట్ ఎన్నికల ప్రచార ప్యానెల్ కన్వీనర్ ఆశిష్ సూద్ మాట్లాడుతూ, ఎంసీసీని ఉల్లంఘించినందుకు కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేయాలని అన్నారు. "కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి మోడల్ ప్రవర్తనా నియమావళిని బహిరంగంగా ఉల్లంఘించారు. ఎలాంటి అనుమతి లేకుండానే కాన్స్‌టిట్యూషన్ క్లబ్‌లో విదేశీ ఎన్‌జీవోల చెక్కులను పంపిణీ చేసినందుకు ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు" అని సూద్ ఆరోపించారు. కార్యక్రమాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోని జిల్లా మేజిస్ట్రేట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, సంబంధిత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ నిధుల లభ్యతతో సంబంధం లేకుండా నగరంలో ఉచిత యోగా తరగతులు కొనసాగుతాయని చెప్పారు. చాలా మంది దాతలు ఎంతో మంది యోగా శిక్షకులకు గౌరవ వేతనం చెల్లించడం ద్వారా పథకాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి ముందుకు వచ్చారని అన్నారు.
కాగా, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు డిసెంబర్ 4న జరగనుండగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, డిసెంబర్ 4న జరగనున్న ఎంసీడీ ఎన్నికల సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను డిసెంబర్ 3న మూసివేయనున్నారు. ఎంసిడి ఎన్నికల తరువాత డిసెంబర్ 5న కూడా పాఠశాలలు మూసివేయబడతాయి. అయితే, ఆన్ లైన్ మోడ్ లో అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల ద్వారా తరగతులు నిర్వహించవచ్చునని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఎంసీడీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా 13,638 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్ల కోసం 68 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 68 పింక్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.