జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో అరవింద్ కేజ్రీవాల్ భేటీ.. రాజకీయాల్లో సరికొత్త చర్చ
New Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీరిద్దరి భేటీ జరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Arvind Kejriwal meets Jharkhand CM Hemant Soren: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో సమావేశమయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. అయితే, రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీరిద్దరి భేటీ జరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ, సోరెన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ట్వీట్ చేశారు.
ఇది మర్యాదపూర్వక సమావేశమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ, “ఈ రోజు ఢిల్లీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. దేశంలోని వివిధ సమస్యలపై అర్థవంతమైన సంభాషణ జరిగింది” అని పేర్కొన్నారు.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 7, 2023
హేమంత్ సోరెన్ కూడా, ఇద్దరూ న్యూఢిల్లీలో కలుసుకున్నారని, జార్ఖండ్-ఢిల్లీకి సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారని ట్వీట్ చేశారు.
— Hemant Soren (@HemantSorenJMM) February 7, 2023
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ అంశాలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై దాడి చేయడంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ముందంజలో ఉన్నందున ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సమావేశం అనంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇది వ్యక్తిగత సమావేశం, మేం మంచి స్నేహితులం, కలుస్తూనే ఉంటాము అని తెలిపారు. ఈ భేటీలో జార్ఖండ్, ఢిల్లీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలనే ప్రశ్నపై కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఈ సమావేశాన్ని 2024 లోక్‌సభ ఎన్నికలతో ముడిపెట్టరాదని అన్నారు. మేము ప్రజలందరినీ కలుస్తాము.. ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా కలుస్తూనే ఉన్నాము అని ఆయన అన్నారు.
ముఖ్యంగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించినప్పటి నుండి, కేజ్రీవాల్ ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతతోనూ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది సమావేశం కావడం ఇది మూడోసారి. జనవరి 18న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఖమ్మం ర్యాలీలో కేసీఆర్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ వేదికను పంచుకున్నారు. ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తోపాటు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, వామపక్ష నేత డి.రాజా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున జనతాదళ్ (యునైటెడ్) ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ కె.సి.త్యాగిని కేజ్రీవాల్ తన నివాసంలో కలుసుకున్నారు. ఇలా వరుసగా కేజ్రీవాల్ ఇతర పార్టీల నాయకులను కలుసుకోవడం రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది.