Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీ.. మధ్యాహ్నం 3 గంటలకు కీలక ప్రెస్ మీట్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు.

Arvind Kejriwal and Bhagwant Mann Meets KCR at Pragathi bhavan ksm
Author
First Published May 27, 2023, 2:14 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లతో కేసీఆర్ లంచ్ కూడా చేశారు. ఇక, ప్రగతిభవన్‌కు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌లకు కేసీఆర్ శాలువాలు కప్పి, పూల బొకే అందజేసి స్వాగతం పలికారు. అంతకుముందు ఈరోజు హైదరాబాద్ చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీ, ఎంపీ రాఘవ్ చద్దాలకు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి స్వాగతం పలికారు.

ఇక, ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్  విపక్షాల మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే జాతీయ రాజకీయాలపై కూడా కేసీఆర్‌తో కేజ్రీవాల్ చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ముగ్గురు సీఎంలు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌, బదిలీలకు సంబంధించిన కేంద్రం ఆర్డినెన్స్‌పై కేసీఆర్ తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌, బదిలీలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ దేశంలోని పలు విపక్ష పార్టీలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌‌లతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయా పార్టీలను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios